యువత ఆరోగ్యమే లక్ష్యం.. యోగాతో డ్రగ్స్‌కు చెక్
కారేపల్లి జూనియర్ కాలేజీ మైదానంలో భారీ అవగాహన సదస్సు
మాదకద్రవ్యాల నివారణే ధ్యేయంగా ప్రభుత్వ కార్యక్రమం
హాజరైన మండల అధికారులు, సర్పంచులు, విద్యార్థులు
కాకతీయ, కారేపల్లి: సింగరేణి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానం ఆరోగ్య చైతన్యానికి వేదికగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా, యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం లక్ష్యంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమం విజయవంతమైంది. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి మండల కేంద్రంలో యువతకు ఆరోగ్య చైతన్యం కల్పిస్తూ యోగ ప్రాముఖ్యతను వివరించేందుకు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కారేపల్లి ఎంపీడీవో కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో సింగరేణి మండల తహసీల్దార్ ఓరుగంటి వెంకటేశ్వర్లు, ఇన్ చార్జ్ ఎంపీడీవో మల్లెల రవీంద్ర ప్రసాద్ పాల్గొని యువతకు యోగ సాధన అవసరాన్ని వివరించారు. మాదకద్రవ్యాలు యువ జీవితాలను నాశనం చేస్తాయని, యోగ మనసుకు ప్రశాంతతను, శరీరానికి దృఢత్వాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులతో మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ అవగాహన సదస్సులో సింగరేణి మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు భూక్య రంజిత్ కుమార్, సర్పంచులు పూసం ఎల్లయ్య, దండు ప్రవీణ్, వీర ప్రతాప్ టోనీ, భూక్య బాలు, వాంకుడోత్ హనుమంతరావు, వివిధ గ్రామపంచాయతీల కార్యదర్శులు, యువకులు, విద్యార్థులు భారీగా పాల్గొన్నారు.

