అర్హులైన జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు కేటాయించాలి
హౌసింగ్ సొసైటీకి 23 ఎకరాల స్థలాన్ని అప్పగించాలి
జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా జర్నలిస్టులకు అన్యాయం
ఖమ్మంలో జర్నలిస్టుల భారీ నిరసన ప్రదర్శన
కాకతీయ, రఘునాథపాలెం : జర్నలిస్టుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్య ధోరణి మీడియా వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా ఉందని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీజేఎఫ్) ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఖమ్మం జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి 23.2 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసినా, వాటిని అమలు చేయడంలో నేటి పాలక పక్షాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని, అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఖమ్మం ప్రెస్ క్లబ్ నుంచి మయూరి సెంటర్ మీదుగా అమరవీరుల స్తూపం వరకు జర్నలిస్టులు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు.
క్యాబినెట్ సమావేశంలో ఆమోదం తెలపాలి
అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించిన అనంతరం జరిగిన సభలో యూనియన్ జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి చిర్రా రవి మాట్లాడారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తామని అనేక వాగ్దానాలు చేసిన నేటి పాలకులు అధికారంలోకి వచ్చాక ద్వంద్వ వైఖరి అవలంబించడం బాధాకరమన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ, జర్నలిస్టులకు కేటాయించిన భూమిని అప్పగించడంలో కాలయాపన చేయడం సరికాదన్నారు. ఈనెల 21న జరిగే రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలోనే ఖమ్మం జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశంపై చర్చించి తక్షణమే ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. నిబంధనల పేరుతో చీకటి ఉత్తర్వులు జారీ చేస్తూ అక్రిడేషన్ల కోత విధించే చర్యలను మానుకోవాలన్నారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు రామిశెట్టి విజేత, జిల్లా ఉపాధ్యక్షులు మంజుల ఉపేందర్, ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు, కోశాధికారి బిక్కీ గోపి, నగర ప్రధాన కార్యదర్శి అమరవరపు కోటేశ్వరరావు, ఎలక్ట్రానిక్ మీడియా వీడియో గ్రాఫర్స్ అధ్యక్షులు నాగరాజు, ఎలక్ట్రానిక్ మీడియా నగర కార్యదర్శి కె.అశోక్, ప్రెస్ క్లబ్ ప్రతినిధులు పానకాలరావు, ముత్యాల కోటేశ్వరరావు, రేపాక యాదగిరి, పులి శ్రీను, మూల జీవన్ రెడ్డి, ఉల్లోజు రమేష్, జక్కుల వెంకటరమణ, మహిళా జర్నలిస్ట్ రోజా తదితరులు పాల్గొన్నారు.

