ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యమకారుల ధర్నా!
కమిటీ చైర్మన్ పదవి నుంచి కేశవరావును తొలగించాలి
250 గజాల ఇంటి స్థలం, 25 వేల రూపాయల పింఛన్ ఇవ్వాలి
జూన్ 2 లోపు హామీలు నెరవేర్చకుంటే నిరసనలు తప్పవు
కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి
కాకతీయ, వరంగల్ సిటీ : తెలంగాణ ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి వేసిన కమిటీకి చైర్మన్‌గా కేశవరావును నియమించడాన్ని ఉద్యమకారులు ఎవరూ ఒప్పుకోవడం లేదని, ఆయనను వెంటనే తొలగించి అర్హులైన ఉద్యమకారులలో ఒకరిని చైర్మన్‌గా నియమించాలని కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం కరీంబాద్‌లోని చెట్లవారిగడ్డ వద్ద వరంగల్ ఉమ్మడి జిల్లా ఉద్యమకారుల సంఘం కన్వీనర్ మరుపల్ల రవి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఏనాడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని కేశవరావును చైర్మన్‌గా నియమించడం అధికార పార్టీకి వత్తాసు పలకడమేనని విమర్శించారు.
హామీల అమలులో కాలయాపన వద్దు
వరంగల్ నియోజకవర్గ మాజీ ఇన్‌ఛార్జి, ఉద్యమ నాయకులు అచ్చ విద్యాసాగర్ మాట్లాడుతూ ఎంతోమంది ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్రం కోసం అనేక కేసులలో ఇరుక్కుని జైలు జీవితం గడిపారన్నారు. అటువంటి వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, అధికారం ఎటు ఉంటే అటువైపు వెళ్లే కేశవరావుకు చైర్మన్ పదవి ఇవ్వడం సబబు కాదన్నారు. అనంతరం ఉమ్మడి జిల్లా ఉద్యమకారుల సంఘం కన్వీనర్ మరుపల్ల రవి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న విధంగా అర్హత కలిగిన ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలము, ప్రతి నెల 25 వేల రూపాయల పింఛన్ అందించాలని డిమాండ్ చేశారు.
ఉద్యమ విలేకరులను, ఫోటోగ్రాఫర్లను గుర్తించాలి
ఉద్యమంలో పాల్గొని మరణించిన వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ పథకాలు అందించాలని, ఉద్యమకారుల కేసుల వివరాలను పోలీస్ శాఖ ద్వారా సేకరించాలని కోరారు. ఆనాడు జరిగిన తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న విలేకరులను, ఫోటో, వీడియో గ్రాఫర్లను కూడా ఉద్యమకారులుగా గుర్తించాలన్నారు. జూన్ రెండో తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అర్హులైన ఉద్యమకారులను గుర్తించి ప్రశంసా పత్రాలు ఇచ్చి గౌరవించాలని, లేనిపక్షంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. ధర్నా కార్యక్రమంలో అండర్ రైల్వే గేట్ జేఏసీ కన్వీనర్ దిడ్డి నరేందర్, ఉద్యమ నాయకులు నార్ల గిరి, రమేష్, నహీంసంకు, నర్సింగం, నాగవెల్లి సాంబయ్య, మిట్టపల్లి రమేష్, అబ్దుల్ పాషా, శంకేసి లింగమూర్తి, కేతిరి రాజశేఖర్, మేకల ఎల్లయ్య, దిండిగాల సోమేశ్వర్, పరదేశి రాజేష్, అంకం దేవానంద్, కెంచ ఆనంద్, కాలే యాదయ్య, సోమ మధుకర్, బస్కే రాజేందర్, ఆవునూరు లక్ష్మి, ముసినిపల్లి జమున, కొలిపాక రమాదేవి, పల్లకొండ యాక లక్ష్మి, చిదురాల సుజాత, కొండపాక లక్ష్మి, సోమ ఉపేంద్ర, కె.సురేందర్, ఎం.రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

