ఈదురు గాలులతో మానాల అతలాకుతలం!
చెట్లు నేలకొరిగి రాకపోకలకు తీవ్ర అంతరాయం
కాకతీయ, రుద్రంగి : రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామంలో ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి తోడు ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. బలమైన గాలుల ప్రభావంతో గ్రామంలోని పలు భారీ వృక్షాలు ఒక్కసారిగా నేలకొరగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రధాన రహదారిపై పెద్ద చెట్టు కూలిపోవడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గాలుల తీవ్రతకు గ్రామంలోని సెంట్రల్ లైటింగ్ స్టాండ్ కూడా నేలమట్టమైంది. మరికొన్ని ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు వంగిపోగా, విద్యుత్ వైర్లు తెగి నేలకొరిగాయి. దీంతో గ్రామస్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే ఈ ప్రమాదాల్లో అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ బీభత్సంపై సమాచారం అందుకున్న ఉప సర్పంచ్ దాసరి అశోక్, నాయకుడు జడగడుగుల అంజయ్య వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రాక్టర్ సహాయంతో రోడ్డుపై పడిన భారీ చెట్లను, కొమ్మలను త్వరితగతిన తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది కూడా గ్రామానికి చేరుకుని దెబ్బతిన్న విద్యుత్ లైన్ల మరమ్మతు పనులను వేగవంతం చేశారు.

