సైబర్ నేరగాళ్ల కొత్త రూటు!
ప్లాస్టిక్ సామాన్ల ఎరతో పాత ఫోన్లు సేకరణ
కరీంనగర్, రామగుండం పరిసరాల్లో ముఠాల సంచారం
డిలీట్ చేసిన డేటాను రికవర్ చేసి బ్లాక్‌మెయిలింగ్, ఆర్థిక మోసాలు
పాత ఫోన్లు ఇచ్చేస్తే అసలు యజమానులకే జైలు ముప్పు
హెచ్చరిస్తున్న పోలీసు అధికారులు.. అప్రమత్తంగా ఉండాలంటూ సూచన
కాకతీయ, కరీంనగర్: సైబర్ నేరగాళ్లు రూట్ మార్చారు. టెక్నాలజీని వాడుకుంటూ రోజుకో కొత్త తరహా మోసానికి తెరతీస్తున్నారు. తాజాగా ఉమ్మడి కరీంనగర్, రామగుండం ప్రాంతాల్లో పాత మొబైల్ ఫోన్ల సేకరణ పేరుతో సరికొత్త దందాకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్లాస్టిక్ సామాన్లు, నిత్యావసర వస్తువులు ఇస్తామంటూ ఇళ్ల ముందుకు వస్తున్న కొందరు వ్యక్తులు.. ప్రజల నుంచి పాత, పాడైపోయిన మొబైల్ ఫోన్లను సేకరించి వాటి ద్వారా సైబర్ అక్రమాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. సాధారణంగా ఫోన్ పాడైపోయినా లేదా కొత్త ఫోన్ కొన్నా.. పాత ఫోన్లను ఇంట్లో మూలన పడేస్తుంటాం. అలాంటి వాటిని ప్లాస్టిక్ డబ్బాలు, గిన్నెల ఆశ చూపి ఈ ముఠాలు గుంజుకెళ్తున్నాయి. మనం ఫోన్లలో డేటా డిలీట్ చేశామని అనుకున్నా.. ఈ నేరగాళ్లు ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం (రికవరీ సాఫ్ట్‌వేర్ల) ద్వారా అందులోని పాత ఫొటోలు, వీడియోలు, బ్యాంకింగ్ వివరాలు, యూజర్ ఐడీలు, పాస్‌వర్డ్‌లను తిరిగి సాధిస్తున్నారు. ఆపై సదరు వ్యక్తిగత సమాచారంతో బ్లాక్‌మెయిలింగ్‌కు దిగడం, బ్యాంకు ఖాతాలు ఖాళీ చేయడం లాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు.
అమాయకులు జైలుకు వెళ్లే ప్రమాదం!
ఈ ముఠాలు సేకరించిన పాత ఫోన్లలో ఫేక్ సిమ్ కార్డులు వేసి ఆర్థిక మోసాలు, బెదిరింపులు, హవాలా లావాదేవీలు నిర్వహిస్తున్నాయి. ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు పోలీసులు రంగంలోకి దిగి సదరు ఫోన్ ‘ఐఎంఈఐ నంబర్ ఆధారంగా విచారణ చేపడితే.. అది అసలు యజమానుల (అమాయక ప్రజల) పేరుతో ఉంటుంది. ఫలితంగా ఎలాంటి తప్పు చేయని పాత ఫోన్ల యజమానులు పోలీసు కేసుల్లో ఇరుక్కుని జైలు పాలు కావాల్సిన పరిస్థితి వస్తోందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

