రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం
ప్రమాదకర మలుపుల్లో నెమ్మదిగా ప్రయాణించాలి
చందుర్తి సీఐ రవీందర్
కొనరావుపేట మండలంలో హెచ్చరిక బోర్డుల ఏర్పాటు
కాకతీయ, కొనరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామ పరిధిలోని ఎల్లమ్మ దేవాలయం సమీపంలో ఉన్న ప్రమాదకర మలుపు వద్ద తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు చందుర్తి సర్కిల్ సీఐ రవీందర్ ఆధ్వర్యంలో శుక్రవారం అక్కడ ప్రమాద హెచ్చరిక, సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐ రవీందర్ మాట్లాడుతూ.. గతంలో ఈ ప్రాంతంలో పలు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుని ప్రాణనష్టం సంభవించినట్లు తెలిపారు. వాహనదారులు ముఖ్యంగా ఇటువంటి మలుపు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉంటూ వేగాన్ని తగ్గించి, నెమ్మదిగా ప్రయాణించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రజల ప్రాణ భద్రతే ప్రధాన లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తోందని, స్టేషన్ పరిధిలోని ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. ప్రమాదాల నివారణకు చొరవ చూపిన కొనరావుపేట పోలీసుల సేవలను స్థానిక ప్రజలు అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ప్రశాంత్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

