నకిలీ ‘సదరం’ సర్టిఫికెట్ కలకలం!
అంగవైకల్యం లేకున్నా 55% వైకల్యంగా నమోదు
హుజూరాబాద్‌లో కోయడ సురేందర్‌పై ఆరోపణలు
అధికారులు విచారణ జరపాలని స్థానికుల డిమాండ్
కాకతీయ, హుజురాబాద్: శారీరక వైకల్యం లేకపోయినా నకిలీ ‘సదరం’ సర్టిఫికెట్ సృష్టించి ప్రభుత్వ ఫలాలను అక్రమంగా పొందుతున్న ఒక వ్యవహారం హుజూరాబాద్‌లో కలకలం రేపుతోంది. అర్హులకు దక్కాల్సిన వికలాంగుల సంక్షేమ పథకాలను తప్పుడు ధ్రువపత్రాలతో కొల్లగొడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హుజూరాబాద్‌కు చెందిన కోయడ సురేందర్ అనే వ్యక్తి పేరుతో 2018 జనవరి 6న ఒక సదరం సర్టిఫికెట్ జారీ అయింది. అందులో అతనికి 55 శాతం లోకోమోషన్ డిసేబిలిటీ (అంగవైకల్యం) ఉన్నట్లు నమోదు చేసి, ‘ఎలిజిబుల్’గా చూపించారు. అయితే, సదరు వ్యక్తికి ఎలాంటి శారీరక లోపాలు లేవని, అందరిలాగే సాధారణంగా తిరుగుతున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నకిలీ సర్టిఫికెట్ ఆధారంగానే ఆయన వికలాంగుల ఆసరా పింఛన్‌తో పాటు ఇతర ప్రభుత్వ సదుపాయాలను పొందుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
సమగ్ర విచారణ జరపాలి
నిజమైన వికలాంగులకు అందాల్సిన సంక్షేమ ఫలాలను ఇలాంటి నకిలీ సర్టిఫికెట్ల ద్వారా దారి మళ్లించడంపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సదరం బోర్డు ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు. తప్పుడు ధ్రువపత్రాలతో ప్రభుత్వాన్ని మోసగించినట్లు రుజువైతే సదరు వ్యక్తిపై కఠిన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

