భక్తితోనే మానసిక ప్రశాంతత
హిందూ ధర్మ పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం
రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి భూమిపూజ
కాకతీయ, రాజన్న సిరిసిల్ల : ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత కలుగుతుందని, దైవచింతన మనిషిని సన్మార్గంలో నడిపిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం వేములవాడ రూరల్ మండలం ఫాజుల్‌నగర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో, దేవాదాయ శాఖ మంజూరు చేసిన రూ.46 లక్షల నిధులతో చేపట్టనున్న పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్లుగా గ్రామస్తులు ఎదురుచూస్తున్న పెద్దమ్మ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. వేములవాడ నియోజకవర్గ పరిధిలో సుమారు 9 దేవాలయాల నిర్మాణానికి నిధులు మంజూరై టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, పనులను నాణ్యతతో నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గత కాంగ్రెస్ హయాంలోనే ఆలయాల అభివృద్ధి జరిగిందని, ఇప్పుడు మళ్లీ అదే స్ఫూర్తితో ముందుకు సాగుతున్నామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ ధర్మ పరిరక్షణకు, ఆలయాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారని.. అందులో భాగంగానే వేములవాడ, సమ్మక్క సారక్క, బాసర, భద్రాచలం ఆలయాల అభివృద్ధికి, గోదావరి పుష్కరాలకు భారీగా నిధులు మంజూరు చేసినట్లు వివరించారు.

