స్కై స్కూల్లో రోబోటిక్స్ శిక్షణ విజయవంతం
నూతన ప్రాజెక్టులు రూపొందించిన విద్యార్థులు
సాధారణ విద్యతో పాటు సాంకేతిక పరిజ్ఞానం అవసరం
: కరస్పాండెంట్ మహేష్
కాకతీయ, రాజన్న సిరిసిల్ల: మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులకు రెగ్యులర్ విద్యతో పాటు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేయడమే లక్ష్యంగా వేములవాడలోని స్కై స్కూల్లో రోబోటిక్స్ శిక్షణ తరగతులను ప్రారంభించినట్లు పాఠశాల కరస్పాండెంట్ మహేష్ తెలిపారు. గురువారం పాఠశాల ఆడిటోరియంలో హైదరాబాద్‌కు చెందిన ‘జీబోటిక్స్ టెక్నాలజీస్’ సంస్థతో కలిసి విద్యార్థులకు రోబోటిక్స్‌పై ఉచిత వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ శిక్షణకు వేములవాడ పరిసర ప్రాంతాలతో పాటు సిరిసిల్ల నుండి పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జీబోటిక్స్ టెక్నాలజీ ప్రతినిధులు తోటం అక్షయ్, మ్యాకల వినయ్, శీలం మానసలు విద్యార్థులకు రోబోటిక్స్ ప్రాథమిక అంశాలు, రోబోట్ కారు తయారీ విధానం, వైఫై కంట్రోల్ కారు తయారీ వంటి టెక్నాలజీ ప్రాజెక్టులపై ప్రాక్టికల్ శిక్షణ అందించారు. విద్యార్థులు ఎంతో ఆసక్తిగా పాల్గొని నూతన ఆవిష్కరణల మెలకువలను నేర్చుకున్నారు. భవిష్యత్తులోనూ విద్యార్థులకు ఉపయోగపడే మరిన్ని రోబోటిక్స్, స్టెమ్ఎడ్యుకేషన్ కార్యక్రమాలను నిర్వహిస్తామని స్కూల్ యాజమాన్యం స్పష్టం చేసింది. సాధారణ చదువులతో పాటు పిల్లలకు ఇలాంటి ఆధునిక సాంకేతికతను నేర్పించడం వారి భవిష్యత్తుకు చక్కని పునాదిగా మారుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

