ఆఖరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తాం
రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట
రాష్ట్ర మంత్రి గడ్డం వివేకానంద
కాకతీయ, చెన్నూరు : రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందోని, అందులో భాగంగానే అన్నదాతలు పండించిన వరి ధాన్యంలో ఆఖరి గింజ వరకు కొనుగోలు చేస్తామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేకానంద స్పష్టం చేశారు. గురువారం మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం బావురావుపేట గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీసీ ప్రతినిధి రఘునాథ్ రెడ్డి మరియు వివిధ శాఖల అధికారులతో కలిసి మంత్రి సందర్శించారు. అక్కడ జరుగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియను, తూకాలను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈసారి రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి
ఈ సందర్భంగా మంత్రి గడ్డం వివేకానంద మాట్లాడుతూ.. ప్రభుత్వం నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేసి, త్వరితగతిన రైతుల ఖాతాలలో నగదు జమ చేస్తోందని తెలిపారు. గతంలో ప్రతి సంవత్సరం ఎకరానికి సగటున 25 క్వింటాళ్ల ధాన్యం వచ్చేదని, కానీ ఈసారి రైతులకు 28 నుండి 32 క్వింటాళ్ల వరకు రికార్డు స్థాయిలో దిగుబడి వస్తోందని హర్షం వ్యక్తం చేశారు. చెన్నూర్, కోటపల్లి పరిసర ప్రాంతాలలో ఈసారి పంట కొద్దిగా ఆలస్యంగా చేతికి వస్తున్నందున, జూన్ 15వ తేదీ వరకు కొనుగోలు కేంద్రాలను నిరంతరాయంగా నిర్వహిస్తామని రైతులకు భరోసా ఇచ్చారు.
నియోజకవర్గంలో 1.60 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యం
గతంలో 2022-23 లో 1 లక్ష 13 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, ఈసారి ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 1 లక్ష 27 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని మంత్రి వివరించారు. జూన్ 6వ తేదీ నాటికి మరో 30 వేల నుండి 40 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తామని, మొత్తంగా ఈ సీజన్లో దాదాపు 1 లక్ష 60 వేల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు.
వర్షాల ముందే కొనుగోళ్లు పూర్తి: కలెక్టర్ కుమార్ దీపక్
అనంతరం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ.. చెన్నూర్ నియోజకవర్గ పరిధిలో ఇప్పటివరకు 70 శాతం ధాన్యం కొనుగోలు ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని తెలిపారు. జైపూర్ మండలంలో వచ్చే 3 రోజులలో కొనుగోళ్లు పూర్తిగా ముగుస్తాయన్నారు. వచ్చే నెల 7వ తేదీ నుండి వర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున, అకాల వర్షాల వల్ల రైతులకు నష్టం కలగకుండా పెద్దపల్లి, కరీంనగర్‌లలో హమాలీ వసతితో కూడిన 2 గోదాములను సిద్ధం చేశామన్నారు. అలాగే జైపూర్ మండలంలోని సుముఖ గోదాములోకి చెన్నూర్ నుండి వచ్చే ధాన్యాన్ని నిల్వ చేసేందుకు అనుమతులు ఇచ్చామని తెలిపారు. చెన్నూర్, కోటపల్లి మండలాలకు సంబంధించి మిగిలిన ధాన్యం ప్రక్రియను రాబోయే 15 రోజులలో పూర్తి చేసే విధంగా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత పౌరసరఫరాల శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

