రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
తెలంగాణలో లక్ష్యానికి మించి ధాన్యం కొనుగోలు
తెలంగాణ ధాన్యాన్ని పూర్తిగా ఎఫ్సీఐ తీసుకోవాలి
ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం సహకరించాలి
మోడల్ సోలార్ పథకం కింద తొలి విడతగా 81 గ్రామాల ఎంపిక
18,542 మెగావాట్ల డిమాండ్ వచ్చినా నిరంతరాయ విద్యుత్
తడిసిన 9,214 మెట్రిక్ టన్నుల ధాన్యం మద్దతు ధరతో కొనుగోలు
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
బోనకల్లో వ్యవసాయ సోలార్ ప్లాంట్ల ప్రారంభం
వారం రోజుల్లో ఖమ్మంలో కొనుగోళ్లు పూర్తి : ఖమ్మం కలెక్టర్ దివాకర
కాకతీయ, ఖమ్మం/బోనకల్ : పర్యావరణ పరిరక్షణతో పాటు రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. గురువారం బోనకల్ మండలం గార్లపాడు గ్రామంలో ‘మోడల్ సోలార్ గ్రామాల పథకం’ కింద వ్యవసాయ మోటార్లకు ఏర్పాటు చేసిన 7.5 కిలోవాట్ల సోలార్ ప్లాంట్లను ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, ట్రాన్స్కో సీఎండీ కృష్ణ భాస్కర్, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్లతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడారు. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించేందుకు మోడల్ సోలార్ గ్రామాల కార్యక్రమం కింద తొలి విడతలో 81 గ్రామాలను ఎంపిక చేశామని భట్టి విక్రమార్క వెల్లడించారు. రూ. 1,380 కోట్ల వ్యయంతో ఈ గ్రామాల్లోని ప్రతి గృహానికి 2 కిలోవాట్లు, వ్యవసాయ మోటార్లకు 7.5 కిలోవాట్ల సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాలోనే 27 గ్రామాల పరిధిలో రూ. 445 కోట్ల వ్యయంతో 16,837 గృహాలు, 4,371 వ్యవసాయ మోటార్లకు సోలార్ ప్యానెళ్లు అమర్చుతున్నామన్నారు. గతంలో 15 వేల మెగావాట్లుగా ఉన్న పీక్ విద్యుత్ డిమాండ్.. ప్రస్తుతం 18,542 మెగావాట్లకు చేరినా, ముందస్తు ప్రణాళికల వల్ల ఎక్కడా చిన్న అంతరాయం లేకుండా నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఉచిత విద్యుత్ అనేది కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని, సన్నరకం వడ్లకు అదనంగా రూ. 500 బోనస్ కూడా ఇస్తున్నామని గుర్తుచేశారు.

కేంద్రం సహకరించాలి
అకాల వర్షాల వల్ల తడిసిన 9,214 మెట్రిక్ టన్నుల ధాన్యానికి కనీస మద్దతు ధర కల్పించి చివరి గింజ వరకు కొనుగోలు చేసి బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలిస్తున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. కేంద్రం నిర్దేశించిన లక్ష్యాల కంటే తెలంగాణలో రికార్డు స్థాయిలో కొనుగోళ్లు జరుగుతున్నాయని వివరించారు. ఖరీఫ్ లో 60 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యానికి గాను 71.86 లక్షల మెట్రిక్ టన్నులు, ప్రస్తుత రబీలో 51.60 లక్షల మెట్రిక్ టన్నుల లక్ష్యానికి గాను ఇప్పటికే 57లక్షల మెట్రిక్ టన్నులు సేకరించామన్నారు. లక్ష్యానికి మించి కొనుగోలు చేయడం వల్ల రైతులకు మద్దతు ధర కింద రూ. 17 వేల కోట్లు చెల్లించామని చెప్పారు. అయితే, కేంద్ర ప్రభుత్వం ఎఫ్సీఐ ద్వారా కేవలం సగం ధాన్యాన్ని మాత్రమే తీసుకుంటోందని, రాష్ట్రం కొనుగోలు చేసిన మొత్తం ధాన్యాన్ని కేంద్రమే సేకరించాలని డిమాండ్ చేశారు. 2014 నుండి జరిగిన ధాన్యం కొనుగోళ్లపై గత పాలకులతో లెక్కలతో సహా చర్చకు తాము సిద్ధమని సవాల్ విసిరారు.
వారం రోజుల్లో ఖమ్మంలో కొనుగోళ్లు పూర్తి : కలెక్టర్
జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలకు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రాగా, అందులో 2.67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర చెల్లించామన్నారు. చింతకాని, ముదిగొండ, బోనకల్ మండలాల్లో పెండింగ్లో ఉన్న కొనుగోళ్లను మరో వారం రోజుల్లో పూర్తి చేస్తామన్నారు. ధాన్యం రవాణా కోసం రైతులు ఎవరికీ పైసా ఇవ్వాల్సిన అవసరం లేదని, ఎవరైనా డబ్బులు అడిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, రెడ్కో ఎండీ అనిల, గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, సుడా చైర్మన్ పువాళ్ళ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

