ఒకే ఇంటి నుంచి ఇద్దరు జవాన్లు
అగ్నివీర్ ఉద్యోగాలు సాధించిన సోదరులు!
దేశ సేవలో భాగస్వాములు కానున్న ఒడెల ఆనంద్, శివకుమార్
కఠిన శారీరక, రాత పరీక్షల్లో ప్రతిభ చాటిన అన్నదమ్ములు
ఒకేసారి ఇద్దరు కొడుకులు సైన్యానికి ఎంపికవడంతో తల్లిదండ్రుల ఆనందం
కాకతీయ, ఇల్లంతకుంట : ఇల్లంతకుంట మండలానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు సోదరులు ఒకేసారి భారత సైన్యంలో ఉద్యోగాలు సాధించి రికార్డు సృష్టించారు. మండల కేంద్రానికి చెందిన ఒడెల లక్ష్మీనారాయణ కుమారులు ఒడెల ఆనంద్, ఒడెల శివకుమార్ భారత ఆర్మీ అగ్నిపథ్ (అగ్నివీర్) ఉద్యోగాలకు ఎంపికై తమ కుటుంబంతో పాటు ఇల్లంతకుంట మండలానికి గర్వకారణంగా నిలిచారు. చిన్ననాటి నుంచే దేశ సేవ చేయాలనే బలమైన సంకల్పంతో ముందుకు సాగిన ఈ అన్నదమ్ములు, అందుకోసం పట్టుదలతో కష్టపడ్డారు. ఆర్మీ నిర్వహించిన అత్యంత కఠినమైన శారీరక దారుఢ్య పరీక్షలతో పాటు రాత పరీక్షల్లోనూ అద్భుత ప్రతిభ కనబరిచి అగ్నివీర్ కొలువులు సాధించారు.
గ్రామ యువతకు ఆదర్శం..
ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఒకేసారి దేశ రక్షణ విధులకు ఎంపిక కావడం స్థానికంగా విశేషంగా నిలిచింది. వీరి విజయంతో తల్లిదండ్రులు, బంధుమిత్రులు హర్షం వ్యక్తం చేయగా, గ్రామ ప్రజలు, యువకులు నిందితుల ఇళ్లకు చేరుకుని అభినందనలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ ఎలాంటి ప్రత్యేక వసతులు లేకపోయినా, స్వయంకృషితో ఆర్మీ ఉద్యోగాలు సాధించిన ఈ అన్నదమ్ములు తోటి యువతకు ఎంతో ఆదర్శంగా నిలిచారని పలువురు కొనియాడారు. దేశ రక్షణ బాధ్యతల్లో భాగస్వాములు కానున్న ఆనంద్, శివకుమార్‌లకు గ్రామస్తులు ఘనంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు తమ వృత్తిలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

