శాంతియుత వాతావరణంతోనే అభివృద్ధి వేగవంతం
జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎస్సై అపూర్వ రెడ్డి
కాకతీయ,చేర్యాల : సమాజంలో శాంతియుత వాతావరణం ఉన్నప్పుడే అభివృద్ధి వేగవంతం అవుతుందని చేర్యాల సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్సై) జి. అపూర్వ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం చేర్యాల పోలీస్ స్టేషన్ ఆవరణలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై అపూర్వ రెడ్డి పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకుంటూ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. 2014 జూన్ 2న ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం నేటితో 12 ఏళ్లు పూర్తి చేసుకుందన్నారు. రాష్ట్ర అభివృద్ధి, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. పోలీసులు వృత్తిని దైవంగా భావించి పనిచేయాలని, సంఘ విద్రోహ శక్తుల పట్ల కఠినంగా ఉంటూ సాధారణ ప్రజలకు భరోసా కల్పించాలన్నారు. సిబ్బంది క్రమశిక్షణతో, బాధ్యతగా పనిచేస్తూ మండల ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సహాయ సబ్ ఇన్స్పెక్టర్లు (ఏఎస్సైలు), హెడ్ కానిస్టేబుళ్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

