డబ్బు సంచులు మోసేవాళ్లకే కాంగ్రెస్‌లో పెత్తనం
నిజం మాట్లాడితే సస్పెండ్ చేస్తారా?
ఇల్లంతకుంట మండల నాయకత్వంపై బద్దం ఎల్లారెడ్డి తిరుగుబాటు
నిజం మాట్లాడితే సస్పెండ్ చేస్తారా?
ఇల్లంతకుంట మండల నాయకత్వంపై బద్దం ఎల్లారెడ్డి తిరుగుబాటు
కాకతీయ, ఇల్లంతకుంట: ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బట్టబయలయ్యాయి. తనపై పార్టీ తీసుకున్న సస్పెన్షన్ చర్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకుడు బద్దం ఎల్లారెడ్డి, మండల నాయకత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం ఆయన విలేకరులకు ప్రకటన విడుదల చేస్తూ.. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కార్యకర్తల నమ్మకంపై కాకుండా డబ్బు, పైరవీల ఆధారంగా నడుస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. తనను సస్పెండ్ చేసే అధికారం మండల అధ్యక్షుడికి లేదన్నారు.
పార్టీ కష్టకాలంలో జెండా మోసిన పేద కార్యకర్తలకు గుర్తింపు లేకుండా పోయిందని, డబ్బు ఖర్చు చేసే వారికే పదవులు, పెత్తనం ఇస్తున్నారని ఎల్లారెడ్డి మండిపడ్డారు. గాలిపల్లి పీఏసీఎస్ చైర్మన్ పదవిని రూ.30 లక్షలకు అమ్ముకున్నారని, వందలాది మంది రైతులను మోసం చేసిన వ్యక్తులను పార్టీలో చేర్చుకుని పెద్దలుగా చెలామణి చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కవ్వంపల్లి సత్యనారాయణ మాట నమ్మి తాము పార్టీ కోసం కష్టపడ్డామని, పార్టీలో జరుగుతున్న తప్పులను ప్రశ్నించినందుకే కక్షపూరితంగా తనపై సస్పెన్షన్ వేటు వేశారని ఆరోపించారు. మండలంలో కొందరు నాయకులు కాంగ్రెస్‌ను తమ వ్యక్తిగత ఆస్తిలా భావిస్తున్నారని, రాబోయే రోజుల్లో కార్యకర్తలే వీరికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఎల్లారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం మండల రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.

