ఖనిజం తేలుతోంది
మైనింగ్ మాఫియాకు ఉచ్చు
మాజీ మంత్రి గంగుల కమలాకర్ వర్గంలో గుబులు
మైనింగ్, పొలిటికల్ వర్గాల్లో టెన్షన్..టెన్షన్
ఎవరి పేరు బయటపడుతుందోనన్న ఉత్కంఠ
2014 నుంచి గ్రానైట్ అక్రమాలపై సీఐడీ ఆరా
నకిలీ వేబిల్లులతో రూ.కోట్ల ఖనిజం దోపిడీ
విజిలెన్స్ చేతికి కీలక నివేదికలు.. ఈడీ తర్వాత సీఐడీ ఎంట్రీ..
ప్రముఖ గ్రానైట్ కంపెనీలపై ఎఫ్ఐఆర్‌ల నమోదుకు కసరత్తు?
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో పదేళ్ల పాటు సాగిన గ్రానైట్ అక్రమాల వ్యవహారం ఇప్పుడు రాజకీయ, వ్యాపార వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. నిబంధనలను తుంగలో తొక్కి సాగించిన ఖనిజ దోపిడీపై ఇన్నాళ్లూ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన అధికార యంత్రాంగం.. ఇప్పుడు ఒక్కసారిగా కరచాలనం చేస్తూ ఉచ్చు బిగిస్తోంది. 2014 నుంచి జరిగిన మైనింగ్ అక్రమాలపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సమగ్ర దర్యాప్తునకు ఆదేశించిన నేపథ్యంలో సీఐడీ అధికారులు రంగంలోకి దిగి దూకుడు పెంచారు. మైనింగ్ శాఖ, విజిలెన్స్ విభాగాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి సిద్ధం చేసిన ప్రత్యేక నివేదికలు ఇప్పటికే సీఐడీకి చేరాయి. జిల్లాకు చెందిన పలు ప్రముఖ గ్రానైట్ కంపెనీలు, వాటి నిర్వాహకులపై త్వరలోనే భారీ స్థాయిలో ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసేందుకు అధికారులు ముమ్మర కసరత్తు చేస్తుండటంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
నకిలీ వేబిల్లులు.. కోట్ల రూపాయల ట్యాక్స్ ఎగవేత..!
గత బీఆర్‌ఎస్ పాలనలో కరీంనగర్, పెద్దపల్లి, గంగాధర, రాఘవపురం ప్రాంతాల్లోని క్వారీల్లో భారీ స్థాయిలో అక్రమ తవ్వకాలు జరిగినట్లు విజిలెన్స్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా గ్రానైట్ బ్లాకులను విదేశాలకు ఎగుమతులు చేయడం, బోగస్ సంస్థల పేర్లతో నకిలీ రవాణా పత్రాలను (వేబిల్లులు) సృష్టించడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొట్టారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన సీనరేజ్ పన్నులను యథేచ్ఛగా ఎగ్గొట్టడమే కాకుండా, క్వారీల్లో జరిగిన వాస్తవ ఉత్పత్తిని తక్కువగా చూపించి వందల కోట్ల రూపాయల మేర దోపిడీకి పాల్పడ్డారు. ఈ వ్యవహారాలన్నింటిపై సీఐడీ లోతైన దర్యాప్తు జరుపుతోంది. ఇప్పటికే మైనింగ్ మాఫియాకు చెందిన కీలక కంపెనీల ఫైళ్లు, కంప్యూటర్ డేటాను దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు.
బీఆర్‌ఎస్ నేతల్లో టెన్షన్.. ఈడీ తర్వాత సీఐడీ ఎంట్రీ!
ఈ మైనింగ్ అక్రమాల దర్యాప్తు రాజకీయంగా కూడా ఊహించని మలుపులు తిరుగుతోంది. మాజీ మంత్రి గంగుల కమలాకర్‌తో పాటు గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో చక్రం తిప్పిన కొందరు కీలక నేతల కుటుంబ సభ్యులు, వారి ముఖ్య అనుచరులు, బంధువులకు చెందిన గ్రానైట్ కంపెనీల పేర్లు కూడా ఈ దర్యాప్తు పరిధిలో ఉన్నట్లు గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే గ్రానైట్ ఎగుమతులు, ఫెమా నిబంధనల ఉల్లంఘన, విదేశీ లావాదేవీలకు సంబంధించి ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) రంగంలోకి దిగి పలువురు బడా వ్యాపారులకు నోటీసులు జారీ చేసి విచారించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాష్ట్రానికి చెందిన సీఐడీ కూడా సమాంతరంగా విచారణను వేగవంతం చేయడంతో ఏ క్షణంలో ఎవరిపై ఎఫ్ఐఆర్ నమోదవుతుందో, ఎవరి పేరు బయటపడుతుందోనన్న ఉత్కంఠ జిల్లాలో పతాక స్థాయికి చేరింది. దర్యాప్తు పూర్తి కావడమే ఆలస్యం.. బడా బాబుల గుట్టు రట్టవడం ఖాయమని అధికారులు అంతర్గతంగా సంకేతాలు ఇస్తున్నారు.

