బీజేపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది
పనులు సాగుతున్న రోడ్డును కొత్తగా తెచ్చినట్లు ప్రచారం
రహదారి పనులు అరవై శాతం పూర్తయినా కొత్త డ్రామాలు
తట్టెడు మట్టి తీయకుండా పనులు ప్రారంభించామని చెప్పడం సరికాదు
అసత్య ప్రచారాలతో లబ్ధి పొందాలనుకుంటున్న ఎంపీ బండి సంజయ్
చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ధ్వజం
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్–జగిత్యాల జాతీయ రహదారి విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆరోపించారు. ఇప్పటికే మంజూరై పనులు కొనసాగుతున్న రహదారిని కొత్తగా ఆమోదించినట్లుగా ప్రచారం చేయడం రాజకీయ మోసమని విమర్శించారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ 2016లోనే అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ కృషితో ఎన్హెచ్-563కు ఆమోదం లభించిందని తెలిపారు. అప్పుడే టెండర్లు పూర్తయ్యాయని భూసేకరణతో పాటు బాధితులకు పరిహారం చెల్లింపులు కూడా జరిగాయని గుర్తు చేశారు. కరీంనగర్–వరంగల్ మధ్య జాతీయ రహదారి పనులు ఇప్పటికే 60 శాతం పూర్తయ్యాయని సుంకే రవిశంకర్ తెలిపారు. అయినప్పటికీ బీజేపీ నేతలు కొత్తగా తామే ప్రాజెక్టు తెచ్చినట్లుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తట్టెడు మట్టి కూడా తీయకుండా పదేపదే పనులు ప్రారంభించామని చెప్పడం ప్రజలను మోసం చేయడమేనని అన్నారు. ఎంపీ బండి సంజయ్ అసత్య ప్రచారాలతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని సుంకే రవిశంకర్ విమర్శించారు. నియోజకవర్గ ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారని అందుకే బండి సంజయ్ ఫెయిల్ అట్టర్లీ ఫ్లాప్ అని ప్రజలే వ్యాఖ్యానిస్తున్నారని అన్నారు. అభివృద్ధి పేరుతో ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలకు స్వస్తి పలకాలని ఇప్పటికే మంజూరైన పనులను తమ ఘనతగా చెప్పుకోవడం సరికాదని ఆయన పేర్కొన్నారు.

