శ్రీరాముడికి రైతుల ముడుపు
అకాల వర్షాల నుంచి పంటలను కాపాడిన దైవానికి కృతజ్ఞత
గంభీరావుపేటలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆనవాయితీ
వైభవంగా సీతారామచంద్ర స్వామి రథోత్సవం
కాకతీయ, గంభీరావుపేట : అకాల వర్షాలు, వడగళ్ల వానల నుంచి పంటలను కాపాడాలని కోరుతూ గంభీరావుపేట మండల కేంద్రంలోని రైతులు కట్టిన ముడుపును ఆదివారం వైభవంగా విప్పారు. ఈ సందర్భంగా రైతులు స్థానిక సీతారామచంద్ర స్వామి వారికి విశేష పూజలు నిర్వహించి, స్వామివారిని రథంపై ఉంచి భజనలు, కోలాటాల నడుమ గ్రామ వీధుల్లో ఊరేగించారు. మహిళలు మంగళహారతులతో స్వామివారికి స్వాగతం పలికి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా అకాల వర్షాల బారి నుంచి పంటలను రక్షించాలని కోరుతూ స్థానిక సీతారామ ఆలయంలో రైతులు ముడుపులు కట్టడం ఇక్కడ దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ. పంట చేతికి అంది, ధాన్యం విక్రయించిన అనంతరం ఈ ముడుపులు విప్పి రథోత్సవం నిర్వహించడం ఇక్కడి రైతుల సంప్రదాయం.
సీతారామస్వామి కర్షక లోకం నమ్మకాన్ని ఎన్నటికీ వమ్ము చేయరని రైతులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ముడుపులు కట్టిన సమయం నుండి విప్పే వరకు ఆ ప్రాంతంలో వర్షాలు కురవవని, చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షాలు పడినా తమ గ్రామం మాత్రం సురక్షితంగా ఉంటుందని రైతులు తమ అనుభవాలను భక్తిశ్రద్ధలతో పంచుకున్నారు.

