పాలిటెక్నిక్ కళాశాలలో మౌలిక వసతుల కల్పన
బీటీపీఎస్ రూ. 1.45 కోట్ల సాయంతో ల్యాబ్ ఏర్పాట్లు
ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఐటీడీఏ ఏపీఓ డేవిడ్ రాజ్ ఆదేశం
కాకతీయ,మణుగూరు : పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు అందిస్తామని ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి (ఏపీఓ) జనరల్ డేవిడ్ రాజ్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశాల మేరకు ఆయన మణుగూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కల్పించవలసిన వసతుల గురించి కళాశాల ప్రిన్సిపాల్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల కోసం అదనపు గదుల నిర్మాణం, ఖాళీ షెడ్డులో ల్యాబ్ ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే క్లాస్ రూమ్స్ నిర్మాణంతో పాటు బీటీపీఎస్ సంస్థ వారు రూ. 1,45,00000 (కోటి 45 లక్షల) విలువైన ల్యాబ్ మెటీరియల్ అందిస్తున్నారని తెలిపారు. దానికి తగినట్లుగా ల్యాబ్ నిర్మాణం చేపట్టాలని, విద్యుత్ సౌకర్యం, క్రీడాస్థలం, క్లాస్ రూముల్లో డ్యూయల్ డెస్క్ బల్లలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ప్రిన్సిపాల్ కోరిన వసతులపై పూర్తిస్థాయిలో నివేదిక తయారు చేసి ఐటీడీఏ కార్యాలయానికి సమర్పించాలని ఏఈని ఆదేశించారు.

చేపల చెరువు సొసైటీ తనిఖీ :
అనంతరం సాంబాయిగూడెం గ్రామంలోని చేపల చెరువు కోఆపరేటివ్ సొసైటీని ఆయన తనిఖీ చేశారు. సొసైటీని సక్రమంగా నడిపించుకోవాలని సభ్యులకు సూచించారు. చేపల మార్కెటింగ్‌కు సంబంధించిన పరికరాలు, వేయింగ్ మిషన్ కొనుగోలు చేసి రికార్డులు కరెక్ట్‌గా మెయింటైన్ చేయాలన్నారు. మంచి లాభాలు పొంది జీవనోపాధిని పెంపొందించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఎఫ్‌డీసీ ఉదయ్ కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ నాగప్రసాద్, ఏఈ ప్రసాద్, ఆర్ఐ రాధా, గోపి తదితరులు పాల్గొన్నారు.

