బిల్లు కోసం పంచాయతీ భవనానికి తాళం
రెండేళ్లుగా పెండింగ్లో బకాయిలు
డబ్బులు చెల్లించే వరకు తాళం తీయనన్న కాంట్రాక్టర్
కనగర్తిలో కలకలం.. అధికారుల తీరుపై విమర్శలు
కాకతీయ, వేములవాడ : గ్రామాభివృద్ధికి ప్రతీకగా నిలవాల్సిన నూతన గ్రామ పంచాయతీ భవనం బకాయిల వివాదానికి కేంద్రబిందువుగా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కనగర్తి గ్రామంలో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనానికి కాంట్రాక్టర్ అండెం మల్లారెడ్డి తాళం వేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. గ్రామ పంచాయతీ భవనం నిర్మాణ పనులు పూర్తై రెండేళ్లు గడుస్తున్నప్పటికీ తనకు రావాల్సిన రూ.1.50 లక్షల బిల్లు ఇప్పటికీ చెల్లించలేదని కాంట్రాక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి సర్పంచ్, వార్డు సభ్యులు, అధికారులు పలుమార్లు హామీలు ఇచ్చినా బకాయిలు విడుదల కాలేదని ఆరోపించారు. గ్రామం కోసం పని చేసినప్పటికీ బకాయిలు అందక అప్పుల పాలయ్యానని మల్లారెడ్డి వాపోయారు. రెండేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగలేదని, తనకు రావాల్సిన డబ్బులు చెల్లించే వరకు భవనాన్ని ప్రారంభించేందుకు అనుమతించబోనని స్పష్టం చేశారు. గ్రామ ప్రజల సౌకర్యం కోసం నిర్మించిన భవనం తాళం వేసి ఉండటంతో గ్రామస్థులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బిల్లు చెల్లింపుల విషయంలో అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహించారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
రెండేళ్లుగా పెండింగ్లో ఉన్న బకాయిలు, కాంట్రాక్టర్ ఆవేదన, భవనానికి తాళం వేయడం వంటి పరిణామాలు కనగర్తిలో సంచలనంగా మారాయి. ఈ వ్యవహారంపై అధికారులు ఎలా స్పందిస్తారు, కాంట్రాక్టర్కు బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు అనే అంశాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

