కరీంనగర్లో కిరాతకం!
మత్తుమందు ఇచ్చి యువతిపై అఘాయిత్యం
గర్భం దాల్చాక గర్భస్రావం..
పెళ్లి పేరిట వంచించి, బెదిరింపులకు పాల్పడిన యజమాని
‘నాకేం కాదు’ అంటూ నిందితుడి దర్పం.. కేసు నమోదు చేసి గాలిస్తున్న పోలీసులు
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరంలో పెళ్లి పేరుతో సాగించిన ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అక్వేరియం షాపు యజమాని ఒకరు ఉద్యోగినిని నమ్మించి, మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసి, చివరకు గర్భం దాల్చిన తర్వాత గర్భస్రావం చేయించి దారుణానికి ఒడిగట్టిన ఘటన సంచలనం రేపింది. టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసిన ఈ ఘటన, నగరవాసులను ఉలిక్కిపడేలా చేసింది. బాధితురాలి కథనం ప్రకారం.. 2025 ఏప్రిల్‌లో ఆమె కరీంనగర్‌లోని క్రిస్టియన్ కాలనీలో ఉన్న ఆకుల నరేష్ అనే వ్యక్తికి చెందిన అక్వేరియం షాపులో ఉద్యోగంలో చేరింది. యజమాని నరేష్ మొదట స్నేహపూర్వకంగా ఉంటూనే, ఆమెను పెళ్లి చేసుకుంటానని ప్రతిపాదించాడు. బాధితురాలు తొలుత నిరాకరించి ఉద్యోగానికి రాజీనామా చేసినా, నరేష్ మళ్ళీ పెళ్లి మాట ఎత్తనని నమ్మించడంతో తిరిగి చేరింది. అయితే, 2025 జూన్ 6న గది చూపిస్తానని నమ్మించి తీసుకెళ్లిన నరేష్, కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేశాడు. ఆ అపస్మారక స్థితిలో యువతిపై అత్యాచారానికి పాల్పడి, విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడు.
చట్టాన్ని వెక్కిరిస్తూ.. నిందితుడి బెదిరింపులు
అప్పటి నుంచి పెళ్లి చేసుకుంటానని నమ్మబలుకుతూ నరేష్ పలుమార్లు శారీరక సంబంధం కొనసాగించాడు. ఈ క్రమంలో యువతి గర్భం దాల్చగా, 2026 ఏప్రిల్‌లో ఆమెకు గర్భస్రావం కలిగించే మందులు ఇచ్చి గర్భాన్ని తొలగించాడు. వివాహం గురించి నిలదీసిన ప్రతిసారీ కాలయాపన చేస్తూ వచ్చిన నరేష్, చివరకు రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయని, పోలీసులకు ఫిర్యాదు చేసినా తనను ఏమీ చేయలేరంటూ బాధితురాలిని బెదిరించాడు. నిందితుడి వేధింపులు, బెదిరింపులు తాళలేక బాధితురాలు చివరికి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడు ఆకుల నరేష్ కోసం గాలింపు చేపట్టారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. బాధితురాలి ఆరోపణలతో షాక్ తిన్న స్థానికులు, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దర్యాప్తు పూర్తయితే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

