పార్టీకి ద్రోహం చేసిన వారికి గుణపాఠం తప్పదు
కష్టపడే కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటాం
పార్టీని వీడిన వారివల్ల ఎలాంటి నష్టం లేదు
ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
సమష్టి కృషితో పార్టీని బలోపేతం చేయాలి
ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్
ఆన్లైన్లో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ప్రక్రియ
కాకతీయ, హనుమకొండ : పార్టీ కోసం నిరంతరం శ్రమించే కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని, అదే సమయంలో పార్టీకి ద్రోహం చేసి వెళ్లిన వారికి తగిన గుణపాఠం తప్పదని మాజీ ప్రభుత్వ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ హెచ్చరించారు. హనుమకొండలోని రామన్నపేట మణిదీప గార్డెన్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 11, 29వ డివిజన్ల బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశం శుక్రవారం జరిగింది. పార్టీ ఆశీర్వాదం, కార్యకర్తల కృషితో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, తనకు ప్రజాసేవ తప్ప మరో వ్యాపారం లేదని ఆయన స్పష్టం చేశారు. అధికారం ఉన్నా లేకున్నా నిరంతరం ప్రజల మధ్యే ఉంటానని, గతంలో కరోనా సమయంలో 60 వేల కుటుంబాలకు అండగా నిలిచానని గుర్తుచేశారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకుంటామని, శ్రమించిన వారికి తగిన గుర్తింపు లభిస్తుందని భరోసా ఇచ్చారు. స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ మారి పదవులు అనుభవించిన వారితో తమకు ఎలాంటి నష్టం లేదని, తన 20 ఏళ్ల ప్రజా జీవితంలో ఎప్పుడూ ప్రతీకార రాజకీయాలు చేయలేదని తెలిపారు.
నిరంతరం ప్రజల పక్షాన పోరాటం
ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేస్తోందని, రాబోయే రోజుల్లో భారత్ రాష్ట్ర సమితి తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను వేధించే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అధికారంలో ఉన్నా లేకున్నా పేదల పక్షాన పోరాటం కొనసాగిస్తానని పేర్కొన్నారు. సభ్యత్వ నమోదు ఇన్చార్జ్, మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి సమిష్టిగా కృషి చేయాలని, సభ్యత్వ నమోదును ఆన్లైన్లో పకడ్బందీగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు దర్శన్ సింగ్, మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు వద్దిరాజ్ గణేష్, జోరిక రమేష్, వివిధ డివిజన్ల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

