ఎన్నికల హామీలు అమలు చేయండి
రూ. 4 వేల ముచ్చట తర్వాత ముందు రూ. 2 వేలు సక్రమంగా అందించండి
మహిళలకు నెలకు రూ.2500 అందజేయాలని డిమాండ్
ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం విఫలం
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి ఫైర్
కాకతీయ, వేములవాడ : ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా గొప్ప మాటలు చెప్పడం వల్ల ప్రయోజనం లేదని, ముందుగా ప్రకటించిన పథకాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి హామీల అమలు తీరుపై ఆయన ప్రశ్నలు సంధించారు. గత కేసీఆర్ పాలనలో వృద్ధాప్య పెన్షన్‌ను రూ. 200 నుంచి రూ. 2000కు పెంచి పేదలకు అండగా నిలిచారని జీవన్ రెడ్డి గుర్తు చేశారు. ప్రస్తుతం పెన్షన్‌ను రూ. 4000కు పెంచుతామని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ మాటలను పక్కన పెట్టి ముందుగా అర్హులైన వారికి ప్రస్తుతం రావాల్సిన పెన్షన్‌ను సక్రమంగా అందించాలని కోరారు. వేములవాడ నియోజకవర్గంలో రైతులకు అదనపు తూకం లేకుండా ధాన్యం సేకరణ జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ, రాష్ట్రంలో మరెక్కడైనా అలాంటి విధానం అమలైందా అని ప్రశ్నించారు. రైతు సంక్షేమంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం సరితూగలేకపోతోందని విమర్శించారు.
మహిళలకు హామీ నెరవేర్చాలి
మహిళలను కోటీశ్వరులను చేస్తామని కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున ప్రగల్భాలు పలికారని, అయితే తమకు ఆ కోట్లు అవసరం లేదని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల హామీ మేరకు ప్రతి మహిళకు నెలకు రూ. 2500 అందిస్తే అదే పెద్ద సహాయమవుతుందని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పార్టీ జిల్లా ప్రముఖులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ మండలాల బాధ్యులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

