వలస ఆదివాసీల సంక్షేమానికి కృషి
: డీఎస్పీ అరుణ్ కుమార్
దుమ్ముగూడెంలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాం
గృహోపకరణాలు, విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ
కాకతీయ, దుమ్ముగూడెం : జిల్లాలోని వలస ఆదివాసీల సంక్షేమం, అభివృద్ధి కోసం పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని భద్రాచలం డీఎస్పీ అరుణ్ కుమార్ స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు దుమ్ముగూడెం మండలం గద్దమడుగు, కొత్తపల్లి గ్రామాల్లో గురువారం నిర్వహించిన ‘కమ్యూనిటీ కనెక్ట్’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆదివాసీ ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పోలీస్ శాఖ పనిచేస్తోందని, యువత, పిల్లలు విద్య ద్వారానే ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని పేర్కొన్నారు. గ్రామంలోకి కొత్త వ్యక్తులు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. వర్షాకాలంలో అంటువ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డీఎస్పీ సూచించారు. గంజాయి, మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్ప్రభావాలను వివరిస్తూ, వీటి అక్రమ రవాణాపై సమాచారం అందించాలని కోరారు. సైబర్ నేరాలు, ఓటీపీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, రోడ్డు భద్రతలో భాగంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని హితవు పలికారు. అనంతరం గ్రామ ప్రజలకు గృహోపకరణాలను, చిన్నారులకు పలకలు, పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్ వెంకటప్పయ్య, ఎస్సై జగన్మోహన్ చారి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

