విద్యార్థులకు పాఠశాలల్లోనే ఆధార్ సేవలు : ఎంఈవో సమ్మయ్య
లక్ష్మీనగరంలో ఆధార్ అప్డేట్ కేంద్రం ప్రారంభం
సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపు
కాకతీయ, దుమ్ముగూడెం : విద్యార్థులకు ఆధార్ సేవలను సులభతరం చేసేందుకు సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో పాఠశాలల్లోనే ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు విద్యాశాఖ అధికారి సున్నం సమ్మయ్య తెలిపారు. గురువారం లక్ష్మీనగరం ఎంపీపీఎస్ పాఠశాలలో ఆయన ఆధార్ సేవలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంఈఓ సమ్మయ్య మాట్లాడుతూ, విద్యార్థులు తమ ఆధార్ కార్డుల్లో బయోమెట్రిక్ నవీకరణ, మొబైల్ నంబర్ అనుసంధానం, చిరునామా మార్పు వంటి పనులను పాఠశాల స్థాయిలోనే సులభంగా పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. ఆధార్ కేంద్ర నిర్వాహకుడు మాట్లాడుతూ, విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆధార్‌కు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. రాబోయే రోజుల్లో మండలంలోని అన్ని పాఠశాలల్లో ఈ సేవలను విస్తరించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

