ప్రైవేట్ పాఠశాలల నిలువు దోపిడీ
స్టేషనరీ, యూనిఫాంల పేరుతో తల్లిదండ్రులపై అదనపు భారం
జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ జీవోను ఖచ్చితంగా అమలు చేయాలి
కరీంనగర్ డీఈఓకు వినతిపత్రం అందజేసిన బీఆర్ఎస్వీ నాయకులు
ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమ తరహా ఆందోళనలు : పొన్నం అనిల్ కుమార్ గౌడ్
కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలు విద్యను వ్యాపారంగా మార్చి పేద, మధ్యతరగతి కుటుంబాలను నిలువునా దోచుకుంటున్నాయని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా డిఫెన్స్ అకాడమీల పేరుతో విద్యాసంస్థలు నడుపుతూ ప్రజలను మోసం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ విద్యార్థి విభావం (బీఆర్ఎస్వీ) రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు.. “విద్యా వ్యవస్థల్లో నెలకొన్న అవస్థలు.. వాటిపై మీ స్పందన” కార్యక్రమంలో భాగంగా సోమవారం కరీంనగర్ జిల్లా విద్యాశాఖ అధికారిని (డీఈఓ) కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో నోటు పుస్తకాలు, యూనిఫాంలు, స్టేషనరీ పేరుతో సాగుతున్న అక్రమ వసూళ్లను డీఈఓ దృష్టికి తీసుకెళ్లారు.
రెండు రోజుల్లో నివేదిక ఇస్తాం
కరీంనగర్ జిల్లా కేంద్రంలో కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు మాఫియా తరహాలో వ్యవహరిస్తూ, విద్యార్థుల ద్వారా కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాయని అనిల్ కుమార్ గౌడ్ ఆరోపించారు. రానున్న రెండు రోజుల్లో ఏయే పాఠశాలల్లో ఎంత మేర పుస్తకాల నిల్వలు ఉన్నాయో సమగ్ర వివరాలతో కూడిన నివేదికను డీఈఓకు అందజేస్తామని తెలిపారు. విద్యాశాఖకు ఇప్పటివరకు మంత్రి లేకపోవడం బాధాకరమన్న ఆయన.. ప్రైవేట్ పాఠశాలల దోపిడీపై ప్రభుత్వం స్పందించకపోతే తెలంగాణ ఉద్యమం తరహాలో శాంతియుత ఆందోళనలు చేపడతామని, అవసరమైతే విద్యాసంస్థలపై ముట్టడికి కూడా వెనకాడబోమని హెచ్చరించారు.
ఫీజు రాయితీ ఉల్లంఘిస్తే చర్యలు : డీఈఓ
జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 100 శాతం ఫీజు రాయితీ కల్పించాలని ఈ సందర్భంగా నాయకులు కోరారు. దీనిపై డీఈఓ సానుకూలంగా స్పందిస్తూ.. జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ కల్పించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఎవరైనా పాఠశాల యాజమాన్యాలు ఆ నిబంధనలను ఉల్లంఘించినట్లు తమ దృష్టికి తీసుకొస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఈఓ హామీ ఇచ్చారు. జర్నలిస్టుల పిల్లలకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్వీ అండగా నిలుస్తుందని నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ ధ్యాస మధుసూదన్ రెడ్డి, శాతవాహన వర్సిటీ ఇన్‌చార్జి చుక్క శ్రీనివాస్, నగర అధ్యక్షుడు బొంకూరి మోహన్, రాష్ట్ర నాయకులు పటేల్ శ్రవణ్ రెడ్డి, ఆరె రవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

