నకిలీ పత్రాలతో ఇంటి రిజిస్ట్రేషన్
స్టాంపులు, పత్రాలు సృష్టించిన ఇద్దరి అరెస్ట్
కాకతీయ, చందుర్తి: తప్పుడు పత్రాలు సృష్టించి ఓ ఇంటిని అక్రమంగా తమ పేరుపై రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తితో పాటు అతనికి సహకరించిన మరో వ్యక్తిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు చందుర్తి ఎస్ఐ జిల్లెల రమేష్ తెలిపారు. చందుర్తి మండలం సనుగుల గ్రామానికి చెందిన పులి నవీన్ తన ఇంటి ఆస్తిని సోదరుడు పులి శ్రీకాంత్ అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మీ-సేవ కేంద్రంలో ఈసీ (ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్) పరిశీలించగా, నవీన్ కుటుంబానికి తెలియకుండానే అన్న భార్య పేరుపై ఆస్తి నమోదై ఉండటంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. గ్రామపంచాయతీ, తహసీల్దార్ కార్యాలయాల్లో విచారణ చేయగా, తాము ఎటువంటి పత్రాలు జారీ చేయలేదని అధికారులు స్పష్టం చేయడంతో నవీన్ పోలీసులను ఆశ్రయించాడు.
స్వాధీనం చేసుకున్న నకిలీ రబ్బర్ స్టాంపులు
బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తులో పులి శ్రీకాంత్ నకిలీ ధ్రువపత్రాలను సృష్టించినట్లు తేల్చారు. అతనికి సహకరించిన కల్లేపల్లి శేఖర్ (ఫీల్డ్ అసిస్టెంట్)ను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి ఇంటి రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన పత్రాలతో పాటు నకిలీ రబ్బర్ స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారిని జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించింది. ఈ కేసును వేగంగా ఛేదించిన ఎస్ఐ జిల్లెల రమేష్‌తో పాటు సిబ్బందిని సర్కిల్ ఇన్స్పెక్టర్ రవీందర్ ప్రత్యేకంగా అభినందించారు.

