పాన్ షాపులకేనా నిబంధనలు..?
బార్లు, వైన్ షాపులకు వర్తించవా..?
కరీంనగర్‌లో హాట్‌టాపిక్‌గా మారిన ‘100 మీటర్ల’ వివాదం
చిన్న వ్యాపారులపైనే దండయాత్ర.. పెద్దలకు మినహాయింపులా?
చట్టం ముందు అందరూ సమానమేనని నిరూపించాలంటున్న స్థానికులు
కాకతీయ, కరీంనగర్ : విద్యాసంస్థలకు సమీపంలో పాన్ షాపుల తొలగింపుపై అధికారులు వరుస చర్యలు చేపడుతుండగా, అదే నిబంధనలు బార్లు, వైన్ షాపుల విషయంలో ఎందుకు అమలు కావడం లేదన్న ప్రశ్న కరీంనగర్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. “చట్టం ఒకరికి ఒకలా.. ఇంకొకరికి ఇంకోలా ఉంటుందా?” అంటూ సామాన్య ప్రజలు అధికారులను నిలదీస్తున్నారు. చిన్న వ్యాపారులపై వెంటనే కొరడా ఝళిపిస్తున్న అధికారులు, భారీ టర్నోవర్ కలిగిన మద్యం దుకాణాల అక్రమాలపై ఎందుకు మౌనం పాటిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పాన్ షాపులపై వేగం.. బార్లపై ఎందుకు మౌనం?
విద్యాసంస్థలకు 100 మీటర్ల పరిధిలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సీఓటీపీఏ (COTPA) – 2003 చట్టంలోని సెక్షన్ 6(బి) ప్రకారం పాన్ షాపులపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు విధించడంతో పాటు లైసెన్సు రద్దు చేసేలా నోటీసులు జారీ చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో తెలంగాణ ఎక్సైజ్ నిబంధనల ప్రకారం బార్లు, వైన్ షాపులు కూడా విద్యాసంస్థలు, దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ఆసుపత్రులకు నిర్దిష్ట దూరంలోనే ఉండాల్సి ఉంటుంది. రూల్-25 ప్రకారం సాధారణంగా 100 మీటర్ల దూరం పాటించాల్సి ఉండగా, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో 50 మీటర్ల వరకు మినహాయింపు ఉందంటూ అధికారులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. పాత లైసెన్సులతో కొనసాగుతున్న మద్యం దుకాణాలకు కొన్ని వెసులుబాట్లు ఉన్నాయని కాలయాపన చేస్తున్నారు.
ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల పక్కనే మద్యం దుకాణాలు!
కరీంనగర్ నగరంలోనే కొన్ని ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు అతి సమీపంలో బార్లు, వైన్ షాపులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. పాన్ షాపులను సీజ్ చేస్తూ, పేద వ్యాపారుల పొట్ట గొడుతున్న అధికారులు.. అదే ప్రమాణాలను బార్లు, వైన్ షాపుల విషయంలో ఎందుకు వర్తింపజేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. పొగాకు వల్ల ఆరోగ్య సమస్యలు వస్తే, మద్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు, కుటుంబ కలహాలు, నేరాలు చోటుచేసుకోవడం లేదా అని ప్రజలు నిలదీస్తున్నారు. ఈ అంశంపై అధికారులు మాత్రం శాఖల పరిధి వేరుగా ఉండటమే కారణమని దాటవేస్తున్నారు. పాన్ షాపులపై పోలీసులు, మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటే, బార్లు, వైన్ షాపుల అంశం పూర్తిగా ఎక్సైజ్ శాఖ పరిధిలోకి వస్తుందని సర్దిచెబుతున్నారు. కార్పొరేషన్ పరిధిలో 50 మీటర్ల నిబంధన వర్తిస్తుందని, పాత లైసెన్సుల విషయంలో కోర్టు కేసులు, చట్టపరమైన ఇబ్బందులు ఉన్నాయని పేర్కొంటున్నారు.
సంయుక్త సర్వే చేయాలని డిమాండ్
అయినప్పటికీ ప్రజలు మాత్రం సమాన న్యాయాన్నే కోరుతున్నారు. పోలీసు, ఎక్సైజ్, మున్సిపల్ శాఖలు సంయుక్తంగా సర్వే నిర్వహించి విద్యాసంస్థల పరిసరాల్లో ఉన్న పాన్ షాపులు, బార్లు, వైన్ షాపుల సంపూర్ణ జాబితాను బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై హోదా, ఆర్థిక బలం చూడకుండా ఒకే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. విద్యార్థుల భద్రత పేరుతో చేపడుతున్న చర్యలు నిజంగా పారదర్శకంగా సాగాలంటే చట్టం ముందు అందరూ సమానమేనని ప్రభుత్వం నిరూపించాల్సిన అవసరం ఉందని స్థానికులు స్పష్టం చేస్తున్నారు. లేకపోతే “చిన్న వ్యాపారులపైనే దండయాత్ర.. పెద్ద వ్యాపారులకు మినహాయింపులు” అనే భావన బలపడి, ఈ చర్చ త్వరలోనే రాష్ట్రవ్యాప్త ఆందోళనగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

