ప్రకృతి బ్లెస్సి పచ్చని సంకల్పం!
అడవికి ఊపిరి పోస్తున్న ‘బాల’ వనం
కాకతీయ, వేములవాడ : వయసు పన్నెండేళ్లు.. కానీ ఆ చిన్నారి భుజాన వేసుకున్న బాధ్యత మాత్రం ఎంతో గురుతరమైనది. చేతిలో స్మార్ట్‌ఫోన్లతో కాలక్షేపం చేసే ఈ తరం పిల్లల మధ్య, విత్తనాల సంచి పట్టుకుని అడవుల కోసం అడుగులు వేస్తోంది రాజన్న సిరిసిల్ల జిల్లా, కోనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన ప్రకృతి బ్లెస్సి. భవిష్యత్ తరాలకు పచ్చని భూమిని అందించాలనే దృఢ సంకల్పంతో ఈ బాల యోధురాలు చేస్తున్న పర్యావరణ పోరాటం ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది. ప్రస్తుతం బద్దెనపల్లి గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న బ్లెస్సి ప్రయాణం ఐదేళ్ల వయసులోనే మొదలైంది. పర్యావరణ ప్రేమికుడైన తండ్రి ప్రకృతి ప్రకాష్ అందించిన స్ఫూర్తితో, గత ఏడేళ్లుగా ఏమాత్రం విరామం లేకుండా విత్తనాలను సేకరించడం, వాటిని ‘సీడ్ బాల్స్’ (విత్తన ఉండలు)గా మార్చి అడవుల్లో వెదజల్లడం ఈ చిన్నారి దినచర్యలో భాగమైంది.

సీడ్ బాల్స్‌తో పచ్చని విప్లవం
కేవలం మొక్కలు నాటడమే కాదు, ప్రకృతి సిద్ధంగా చెట్లు పెరిగేలా సీడ్ బాల్స్ తయారు చేయడంలో ఈ చిన్నారిది అందెవేసిన చేయి. అల్లనేరేడు, సీతాఫలం, చింత, పులిచింత, నేరేడు వంటి స్థానిక జాతులకు చెందిన విత్తనాలను సేకరించి, మట్టితో కలిపి ఉండలుగా చేసి అడవుల్లో విసిరేయడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. ఈ ఏడాది ఒక్కటే 10 వేల అల్లనేరేడు విత్తనాలను గంభీరావుపేట పెద్దమ్మ అడవుల్లో చల్లి తన పట్టుదల చాటుకుంది.
డ్రోన్ల సాయంతో మూడు రాష్ట్రాల్లో..
ప్రకృతిని పచ్చగా మార్చే క్రమంలో ఈ చిన్నారి ఆధునిక సాంకేతికతను కూడా అందిపుచ్చుకుంది. మానాల, శివగలపల్లి, కొండగట్టు వంటి స్థానిక అడవులతో పాటు, డ్రోన్ల సాయంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో కూడా విత్తన వర్షం కురిపిస్తూ పర్యావరణ ప్రేమికుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది.
ఆదర్శంగా చిన్నారి సంకల్పం
“అడవులు ఉంటేనే జీవం ఉంటుంది.. ప్రతి ఒక్కరూ కనీసం ఒక్క మొక్కనైనా నాటి ప్రకృతిని కాపాడాలి” అని చిన్నారి బ్లెస్సి ఇస్తున్న పిలుపు నేటి తరానికి దిశానిర్దేశం చేస్తోంది. ప్రభుత్వాలు, భారీ సంస్థలు చేయాల్సిన పర్యావరణ పరిరక్షణ బాధ్యతను తన చిట్టి చేతులతోనే భుజాన వేసుకుని, రాష్ట్రవ్యాప్తంగా స్ఫూర్తిదాయకమైన పర్యావరణ ఉద్యమానికి ఈ చిన్నారి ప్రతీకగా నిలుస్తోంది. ఒక చిన్నారి సంకల్పం లక్షల చెట్లకు ప్రాణం పోస్తుంటే, ఆమె ప్రయాణం తెలంగాణ గర్వించేలా ఉందని స్థానికులు కొనియాడుతున్నారు.

