క్రిటికల్‌గా..క్రిటికల్ కేర్
రూ.23 కోట్ల ఖర్చు.. చికిత్సలు కరువు..!
రూ.23.75 కోట్లతో భవనం ఉన్నా రోగులకు తప్పని ఇబ్బందులు
డాక్టర్లు, ఆధునిక పరికరాలు లేక వరంగల్, హైదరాబాద్‌లకు రెఫర్లు
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పేద రోగులకు దక్కని ఆరోగ్య భరోసా
కాకతీయ, కరీంనగర్ : ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అత్యవసర వైద్య సేవలకు కీలకమైన క్రిటికల్ కేర్ విభాగం నిరుపయోగంగా మారుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు కుమరం భీం, మంచిర్యాల జిల్లాల ప్రజలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాల్సిన ఈ విభాగం, ప్రస్తుతం వైద్యులు మరియు వైద్య పరికరాల కొరతతో కొట్టుమిట్టాడుతోంది. ఫలితంగా ప్రాణాపాయ స్థితిలో చికిత్స కోసం వచ్చే రోగులను వరంగల్, హైదరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడుతోంది.
రూ. 23.75 కోట్లతో భవనం.. సేవలు మాత్రం శూన్యం
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని 8 ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్రిటికల్ కేర్ విభాగాల ఏర్పాటు కోసం నిధులు మంజూరు చేసింది. ఇందులో భాగంగా కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో రూ. 23.75 కోట్ల భారీ వ్యయంతో ప్రత్యేక భవనాన్ని నిర్మించారు. గుండె సంబంధిత చికిత్సల కోసం క్యాథ్ ల్యాబ్, మూత్రపిండాలు, మెదడు, ఎముకల విభాగాలతో పాటు ఇతర ప్రత్యేక వైద్య సేవలకు సుమారు 50 మంది సూపర్ స్పెషాలిటీ వైద్యులను ఇక్కడ నియమించాల్సి ఉంది. అలాగే అత్యాధునిక పరికరాల నిర్వహణ కోసం సాంకేతిక నిపుణులను కూడా అందుబాటులో ఉంచాలి. అయితే, ఈ భవనం ప్రారంభమై ఏడాది దాటినా ఇప్పటివరకు ఎలాంటి నియామకాలు చేపట్టకపోవడం గమనార్హం.
అత్యవసర కేసులకు రెఫర్లే దిక్కు
ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న పరిమిత వైద్య సిబ్బందే కొన్ని ప్రత్యేక విభాగాల రోగులకు సేవలు అందిస్తున్నారు. రోజుకు సగటున 10 మంది ప్రమాద బాధితులు ఆసుపత్రికి వస్తుండగా, మెదడు సంబంధిత (న్యూరో) చికిత్సల కోసం నెలకు 100 మందికి పైగా రోగులు, ఎముకల అత్యవసర చికిత్సల కోసం 70 నుండి 100 మంది వరకు వస్తున్నారు. కానీ ఇక్కడ ప్రత్యేక వైద్యులు, ఆధునిక పరికరాలు లేకపోవడంతో వారిని వరంగల్ ఎంజీఎం, హైదరాబాద్ లోని గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులకు పంపిస్తున్నారు. సకాలంలో వైద్యం అందక పోవడంతో రోగుల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారుతున్నాయి.
పరికరాల కొరతతో వెలవెలబోతున్న విభాగం
ఆపరేషన్ థియేటర్లకు అవసరమైన శస్త్రచికిత్స టేబుళ్లు, వెంటిలేటర్లు, మల్టీపారా మానిటర్లు, పడకలు, ల్యాబ్ సదుపాయాలు తగిన స్థాయిలో లేవని సమాచారం. స్థానిక రోటరీ క్లబ్ అందించిన సీ-ఆర్మ్ పరికరం, అంబులెన్స్తోనే కొంత మేర నెట్టుకొస్తున్నారు. ప్రత్యేక వైద్య విభాగాల సంగతి పక్కన పెడితే, సాధారణ శస్త్రచికిత్సలకు అవసరమైన పరికరాల కొరత కూడా తీవ్రంగా ఉందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ వైద్య కళాశాలకు టీచింగ్ హాస్పిటల్‌గా ఉన్న ఈ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, క్రిటికల్ కేర్ విభాగానికి అవసరమైన సౌకర్యాలు కల్పించి, ప్రత్యేక వైద్యులు, నర్సింగ్ సిబ్బందిని వెంటనే నియమించాలని రోగులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

