పల్లెవెలుగు బస్సులకు ఎక్స్ప్రెస్ బోర్డులు
హుజూరాబాద్ ఆర్టీసీ తీరుపై ప్రయాణికుల ఆగ్రహం
అయోమయంలో ప్రయాణికులు..
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఆర్టీసీ యాజమాన్యం
డిపోలో బస్సుల కొరతే కారణమా? అనే సందేహాలు
కాకతీయ, హుజూరాబాద్: హుజూరాబాద్ ఆర్టీసీ బస్టాండ్లో విచిత్ర పరిస్థితి నెలకొంది. సామాన్యులకు రవాణా సదుపాయం కల్పించే పల్లెవెలుగు బస్సులకు, ఎక్స్ప్రెస్ సర్వీసు బోర్డులను తగిలించి నడపడం ప్రయాణికులను తీవ్ర గందరగోళానికి గురిచేస్తోంది. బస్సు రకాన్ని బట్టి ఛార్జీలు, స్టేజీలు మారుతుండటంతో, ఏ సర్వీస్ ఏంటో తెలియక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఆర్టీసీలో పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ సర్వీసులకు ప్రత్యేక నిబంధనలు ఉంటాయని, కానీ ఇలా బోర్డులు మార్చి ప్రయాణికులను తప్పుదోవ పట్టించడం ఆర్టీసీ నిర్లక్ష్యానికి నిదర్శనమని ప్రయాణికులు మండిపడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు, వృద్ధులు, విద్యార్థులు బోర్డును నమ్మి బస్సు ఎక్కిన తర్వాత, అది వేరే సర్వీస్ అని తెలిసి ఆవేదన చెందుతున్నారు. ఇది కేవలం బోర్డు సమస్యేనా లేక డిపోలో బస్సుల కొరత వల్ల అధికారులు చేస్తున్న సర్దుబాటా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
డిపోలో బస్సుల కొరతే ప్రధాన కారణమా?
డిపోలో సరిపడా బస్సులు లేకపోవడం, మరమ్మతులకు గురైన వాహనాలు రోడ్డెక్కకపోవడం, ఉన్న కొన్ని బస్సులను ఇతర రూట్లకు మళ్లించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని సమాచారం. అధికారులు అందుబాటులో ఉన్న ఏ బస్సుకు ఏ బోర్డు ఉంటే అది పెట్టి నడిపిస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని, అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. రవాణా రంగంలో ప్రయాణికుల విశ్వాసమే ప్రధానమని, ఇలాంటి నిర్లక్ష్యపు చర్యలు ఆర్టీసీ ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయని పలువురు మేధావులు హెచ్చరిస్తున్నారు. తక్షణమే జిల్లా ఆర్టీసీ అధికారులు హుజూరాబాద్ డిపోపై దృష్టి సారించాలని, బస్సుల కొరతను తీర్చడంతో పాటు, ప్రతి బస్సుకు సరైన డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేసి ప్రయాణికుల గందరగోళాన్ని నివారించాలని డిమాండ్ చేస్తున్నారు.

