గోదావరిలో అడ్డగోలుగా ఇసుక దందా
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ‘ఛలో గోదావరి’
సీతమ్మసాగర్ డీ-సిల్టింగ్ ముసుగులో అక్రమ తవ్వకాలు
ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికార యంత్రాంగం
అక్రమ తవ్వకాలు, రవాణాలో మంత్రుల హస్తం
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీష్ రెడ్డి
కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా గోదావరి నదిలో సీతమ్మసాగర్ డీ-సిల్టింగ్ పేరుతో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలపై బీఆర్ఎస్ పార్టీ సమరానికి సిద్ధమైంది. అక్రమాలను అడ్డుకోవడంలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే భారీ స్థాయిలో ‘ఛలో గోదావరి’ కార్యక్రమాన్ని చేపడతామని ఆ పార్టీ నాయకుడు, రెడ్కో మాజీ చైర్మన్ వై. సతీష్ రెడ్డి హెచ్చరించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అక్రమ తవ్వకాలపై జిల్లా కలెక్టర్, ఆర్డీవోకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా వారం రోజులుగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి నదిలో జరుగుతున్న భారీ స్థాయి తవ్వకాలపై తాము సమర్పించిన ఆధారాలను అధికారులు కనీసం పరిశీలించకపోవడం వెనుక పెద్దల ఒత్తిడి ఉందని సతీష్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంలో మంత్రులు, ఎమ్మెల్యేల ప్రమేయం ఉందని, అందుకే అధికారులు తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించేందుకు వెనుకాడుతున్నారని విమర్శించారు. అధికారుల మౌనం చూస్తుంటే, ప్రజా ప్రయోజనాల కంటే అక్రమ ఆర్థిక లావాదేవీలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోందని ఆయన ధ్వజమెత్తారు.
రైతుల ఆందోళన.. అధికారుల నిర్లక్ష్యం
గోదావరి నదిలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తరలించడం వల్ల భూగర్భ జలాలు అడుగంటి, సాగునీటి సమస్య తీవ్రమవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. స్థానికుల వేదనను విస్మరించి, అక్రమార్కులకు కొమ్ము కాస్తున్న అధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని, తవ్వకాలను నిలిపివేసి, గుట్టలుగా నిల్వ చేసిన ఇసుకను సీజ్ చేయాలని ఆయన కోరారు. ఇసుక మాఫియాపై చర్యలు తీసుకోని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని సతీష్ రెడ్డి ప్రకటించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రహదారులను దిగ్బంధించి, ఇసుక రవాణాను పూర్తిగా అడ్డుకుంటామని హెచ్చరించారు. అక్రమ తవ్వకాలపై ప్రజలకు పూర్తి వాస్తవాలు వివరిస్తామని తెలిపారు. అవసరమైతే భారీ స్థాయిలో ‘ఛలో గోదావరి’ కార్యక్రమాన్ని చేపట్టి, అక్రమార్కుల గుట్టు రట్టు చేస్తామని స్పష్టం చేశారు. ఈ అక్రమాలకు అనుమతులిచ్చిన వారిపై, బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు పోరాటం ఆగదని ఆయన తేల్చిచెప్పారు.

