సొమ్ముంది ఖాతాలో… సతమతం బ్యాంకులో!
కోనరావుపేట యూనియన్ బ్యాంకులో నగదు కొరత
ఖాతాదారుల అవస్థలు.. పట్టించుకోని సిబ్బంది
కాకతీయ, వేములవాడ: వడ్లు విక్రయించి ఖాతాల్లో జమ అయిన సొమ్మును తీసుకుందామని బ్యాంకుకు వచ్చిన రైతులకు తీవ్ర నిరాశ ఎదురైంది. కోనరావుపేట మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంకులో శుక్రవారం నగదు కొరత, సిబ్బంది నిర్లక్ష్యంతో రైతులు, వృద్ధులు, మహిళలు గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది. రైతుల వడ్ల విక్రయానికి సంబంధించిన నగదు ఖాతాల్లో జమ కావడంతో ఉపసంహరణ కోసం పెద్ద సంఖ్యలో రైతులు బ్యాంకుకు చేరుకున్నారు. అయితే మధ్యాహ్నానికే నగదు లేదని సిబ్బంది చేతులెత్తేయడంతో రైతులు ఆందోళన చెందారు. అత్యవసర అవసరాల కోసం వచ్చిన వారు నిరాశతో వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం 12:30 గంటల సమయంలోనూ సిబ్బంది తమ సీట్లలో లేకపోవడంతో ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బంది అందుబాటులో లేకపోవడంపై ప్రశ్నించిన వారికి సరైన సమాధానం కరువైంది.
మేనేజర్ దురుసు ప్రవర్తన
తమ సమస్యను విన్నవించుకుందామని వెళ్లిన ఖాతాదారుల పట్ల బ్యాంకు మేనేజర్ యాదగిరి దురుసుగా, అహంకారపూరితంగా ప్రవర్తించారని పలువురు ఆరోపించారు. వినియోగదారుల సమస్యలను పరిష్కరించే బాధ్యతను విస్మరించి, నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన సమాచారం ఇవ్వకపోవడంతో వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కోనరావుపేట యూనియన్ బ్యాంకులో నెలకొన్న నగదు కొరతను అధిగమించాలని, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు, ఖాతాదారులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సకాలంలో బ్యాంకింగ్ సేవలు అందేలా చూడాలని వారు కోరుతున్నారు. ఈ విషయమై మేనేజర్ యాదగిరిని వివరణ కోరగా, ఆయన స్పందించలేదు.

