ఇందిరా మహిళా శక్తితో ఆర్థిక ప్రగతి
మహిళల ఆర్థిక సాధికారతకు ఎస్ హెచ్ జీల కృషి
యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి సబ్సిడీ, రుణాలు
సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
తంగళ్లపల్లిలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ప్రారంభం
శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని యువతకు పిలుపు
కాకతీయ, సిరిసిల్ల టౌన్: ఇందిరా మహిళా శక్తి పథకం మహిళా సంఘాల ఆర్థిక ప్రగతికి ఎంతగానో దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్వయం సహాయక సంఘాల మహిళలు ఏర్పాటు చేసుకున్న వెంకటసాయి కోల్డ్ ప్రెస్ ఆయిల్ & ఫ్లోర్ మిల్ యూనిట్, కోవిదా మిల్క్ పాయింట్‌ను శుక్రవారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా యూనిట్ల పనితీరు, ఆదాయం గురించి మహిళలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇందిరా మహిళా శక్తి కింద సుమారు రూ. 11 లక్షల 50 వేలతో ఆయిల్, ఫ్లోర్ మిల్ యూనిట్ ప్రారంభించామని, దీనికి పీఎం ఎఫ్ఎంఈ పథకం ద్వారా రూ. 3 లక్షల 50 వేల సబ్సిడీ లభిస్తుందని వివరించారు. మరో డైరీ యూనిట్ ఏర్పాటుకు మహిళా సంఘాల ద్వారా రూ. 5 లక్షల రుణం ఇప్పించినట్లు తెలిపారు. ఇక్కడ డైరీ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని, జిల్లాలో ఇటువంటి యూనిట్లు మరిన్ని ఏర్పాటు చేసేందుకు మహిళలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బ్యాంకర్ల సమావేశంలో మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని స్పష్టం చేశారు.
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా కేంద్రంలో ఆర్ సేథీ ఆధ్వర్యంలో గ్రామీణ యువతకు ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ అందుబాటులో ఉందని కలెక్టర్ తెలిపారు. ఆర్థికంగా రాణించేందుకు యువత ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, లీడ్ డిస్ట్రిక్ మేనేజర్ మల్లికార్జున రావు, ఏఎంసీ వైస్ చైర్మన్ నర్సింగం, ఇంచార్జి తహసీల్దార్ మురళి, ఇంచార్జి ఎంపీడీఓ రమేష్, సర్పంచ్ లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు.

