అల్లం, బెల్లం..మార్కెట్ పన్నుకు సున్నం!
వరంగల్‌లో 60కి పైగా దుకాణాలు..
అనుమతులున్నవి మాత్రం మూడో, నాలుగో
మిగతాదంతా ‘బ్లాక్’ దందా
బజారు అధికారుల మామూళ్ల మాయాజాలం
ప్రభుత్వ ఆదాయానికి ఏటా లక్షల్లో గండి
సూపర్‌వైజర్ల కనుసన్నల్లోనే ‘వసూళ్ల’ పర్వం
కాకతీయ, వరంగల్ ప్రతినిధి : మార్కెట్ కమిటీ పరిధిలోకి రావాల్సిన వ్యాపారాలు ఇప్పుడు అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. వరంగల్ నగరంలో అల్లం, వెల్లుల్లి, ఉల్లిగడ్డ వంటి నిత్యావసర సరుకుల వ్యాపారం ఏటా కోట్ల రూపాయల్లో సాగుతోంది. అయితే, నిబంధనల ప్రకారం లైసెన్సులు పొందాల్సిన దుకాణాలు మాత్రం వేళ్లపై లెక్కపెట్టే అంత మాత్రమే ఉన్నాయి. మిగిలిన వ్యాపారమంతా అధికారుల మామూళ్ల మత్తులో ‘బ్లాక్’గా సాగుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వ ఖజానాకు అందాల్సిన లక్షలాది రూపాయల ఆదాయం, కొందరు బజారు అధికారుల జేబుల్లోకి వెళ్తోంది.
నగరంలో 60కి పైగా దుకాణాలు.. లైసెన్సులేవి?
వరంగల్ నగరంలో అల్లం, వెల్లుల్లి, ఆలుగడ్డ వంటి సరుకుల వ్యాపారం చేసే దుకాణాలు 60కి పైగా ఉంటాయని అంచనా. మార్కెట్ శాఖ నిబంధనల ప్రకారం ప్రతి దుకాణం లైసెన్సు పొందాలి, సరుకు దిగుమతిపై పన్ను చెల్లించాలి. కానీ, రికార్డులను పరిశీలిస్తే కేవలం మూడు, నాలుగు దుకాణాలకు మాత్రమే అనుమతులు ఉన్నట్లు తెలుస్తోంది. అంటే, మిగిలిన 50కి పైగా దుకాణాలు ఎటువంటి లైసెన్సులు లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయి. పాత బీటుబజారు ఒక్కచోటే 20కి పైగా దుకాణాలు ఉండగా, ప్రతి రోజూ ఒక్కో లారీ సరుకు దిగుమతి అవుతోంది. ఈ లెక్కన నెలకు వందల లారీల సరుకు మార్కెట్ పన్ను కట్టకుండానే దర్జాగా విక్రయించబడుతోంది.
బజారు అధికారుల మామూళ్ల మాయాజాలం
ఈ అక్రమ దందా అంతా బజారు అధికారుల కనుసన్నల్లోనే సాగుతోంది. వ్యాపారాలను పర్యవేక్షించి, పన్ను వసూలు చేయాల్సిన బాధ్యత మార్కెట్ శాఖకు చెందిన సూపర్‌వైజర్లది. కానీ, వారు బాధ్యతలను పక్కనపెట్టి వ్యాపారుల నుంచి ‘నెలవారీ మామూళ్లు’ వసూలు చేయడానికే ప్రాధాన్యమిస్తున్నారు. పదవీ విరమణ పొందిన సూపర్వైజర్ నుండి ప్రస్తుత అధికారి వరకు ఇదే తంతు కొనసాగుతోంది. కొన్నేళ్లుగా ఒకే అధికారిని ఈ విధుల్లో ఉంచడం వెనుక ఉన్న మర్మం ఏంటో అర్థం చేసుకోవచ్చు. సదరు అధికారులు ఆయా వ్యాపార లావాదేవీలను లెక్కగట్టి ప్రభుత్వానికి జమ చేయాల్సింది పోయి, తమ జేబులు నింపుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రభుత్వ ఆదాయానికి ఏటా లక్షల్లో గండి
ప్రభుత్వానికి రావాల్సిన మార్కెట్ ఫీజు ఎగ్గొట్టడం ద్వారా ఖజానాకు ఏటా లక్షలాది రూపాయల నష్టం వాటిల్లుతోంది. ఒకేసారి లారీ లోడు దిగుమతి చేసుకునే దుకాణాల నుంచి వసూలు చేయాల్సిన పన్నును మాయం చేసి, వ్యాపారుల నుంచి తక్కువ మొత్తాన్ని మామూళ్ల రూపంలో తీసుకోవడం ద్వారా మార్కెట్ ఆదాయానికి పెద్ద ఎత్తున గండి పడుతోంది. పక్కా రికార్డులు ఉంటే ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది, కానీ రికార్డులన్నీ అక్రమాలకు అనుగుణంగా మార్చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అక్రమాలపై విచారణ చేపట్టాలి
నిబంధనలను గాలికి వదిలేసి, ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొడుతున్న అధికారులపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరుగుతోంది. వరంగల్ నగరంలోని అక్రమ దుకాణాలన్నింటినీ గుర్తించి, తక్షణమే లైసెన్సు ప్రక్రియ చేపట్టాలని, అక్రమాలకు సహకరిస్తున్న బజారు అధికారుల తీరుపై విచారణ జరిపించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజల సొమ్మును స్వాహా చేస్తున్న అక్రమార్కుల భరతం పట్టకపోతే, ప్రభుత్వ ఖజానాకు మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.

