పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి
నిరసన తెలిపిన ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్
కాకతీయ, ఖమ్మం : అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ, దేశంలో ఇంధన ధరలను పెంచి సామాన్యులపై భారం మోపుతున్న కేంద్ర ప్రభుత్వ తీరును ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ నాయకులు తప్పుబట్టారు. ఆల్ ఇండియా కమిటీ పిలుపు మేరకు మంగళవారం ఖమ్మం రైల్వే స్టేషన్ వద్ద చేపట్టిన నిరసనలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వై. విక్రమ్, జిల్లా ఉపేందర్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం కేవలం కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చేందుకే సామాన్యుల జేబులు ఖాళీ చేస్తోందని నాయకులు మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ఆటో, ట్రాలీ, క్యాబ్ డ్రైవర్ల బతుకులు దయనీయంగా మారాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లు కార్మికుల హక్కులను హరించేలా ఉన్నాయని, వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకం వల్ల ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతుంటే, అటు కేంద్రం ధరలు పెంచి “మునిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా” తయారైందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్లు, కార్మికుల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. కార్మికుల హక్కులను హరించే నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా కోశాధికారి ధరావత్ రాందాస్, జిల్లా కమిటీ సభ్యులు గంగుల నరసయ్య, బీమా, ఉపేందర్, రవి, గాని, నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, రాజారావు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

