ప్రభుత్వ వసతి గృహాల భద్రత ప్రశ్నార్థకం
ప్రహరీ లేకపోవడంతో ఆందోళనలో విద్యార్థులు
కాకతీయ, ఖమ్మం : ఖమ్మం జిల్లా ఎన్ఎస్పీ క్యాంపులో ఉన్న ప్రభుత్వ ఎస్సీ అభివృద్ధి శాఖ బాలుర వసతి గృహం-సి, ఆనంద నిలయం హాస్టళ్లకు భద్రత కరువైంది. మున్సిపాలిటీ డ్రైన్ నిర్మాణానికి అడ్డుగా వస్తుందనే కారణంతో కాంట్రాక్టర్ హాస్టల్ ప్రహరీ గోడను తొలగించడంతో విద్యార్థుల భద్రత తీవ్ర ప్రశ్నార్థకంగా మారింది. ఈ రెండు వసతి గృహాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన సుమారు 150 మందికి పైగా విద్యార్థులు ఆశ్రయం పొందుతున్నారు. ప్రహరీ గోడ లేకపోవడంతో రాత్రి వేళల్లో అపరిచిత వ్యక్తులు వసతి గృహాల్లోకి వస్తుండటంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అంతేకాకుండా, పరిసర ప్రాంతాల్లో పందులు, కుక్కలు క్యాంపస్‌లోకి వచ్చి స్వైరవిహారం చేస్తున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. తమ పిల్లల భద్రత పట్ల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిధుల పక్కదారి పట్టాయా?
కోవిడ్ సమయంలో మూతపడిన ఈ రెండు వసతి గృహాల పునఃప్రారంభం కోసం ప్రభుత్వం సీఎం కృషియల్ వెల్ఫేర్ నిధుల నుంచి ఒక్కో హాస్టల్‌కు 5 లక్షల చొప్పున మొత్తం 10 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు సమాచారం. అయితే, ఆ నిధులు ఏమయ్యాయనే దానిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిధులను పక్కదారి పట్టించారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, అధికారులు వెంటనే స్పందించి విద్యార్థుల భద్రత దృష్ట్యా యుద్ధ ప్రాతిపదికన ప్రహరీ గోడను నిర్మించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

