- ఖాళీగా ఎమ్మార్వో పోస్టుతో నిలిచిన పాలన
- స్తంభించిన భూముల క్రయవిక్రయాలు, లావాదేవీలు
కాకతీయ,చేర్యాల : ఇటీవల ఏసీబీకి చిక్కిన తహసీల్దార్ దిలీప్ నాయక్ వ్యవహారంతో చేర్యాల మండల రెవెన్యూ కార్యాలయంలో పరిపాలన పూర్తిగా కుంటుపడింది. ప్రస్తుతం ఆ పోస్టు ఖాళీగా ఉండటంతో భూముల రిజిస్ట్రేషన్లు, వారసత్వ బదిలీలు వంటి కీలక ప్రక్రియలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. కార్యాలయానికి వస్తున్న ప్రజలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నతాధికారుల కోసం నిరీక్షిస్తూ నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఇప్పటికే అడ్వాన్స్‌లు చెల్లించి ఒప్పందాలు చేసుకున్న వారు, గడువు ముగుస్తున్నా రిజిస్ట్రేషన్లు పూర్తి కాక తీవ్ర ఆర్థిక నష్టాలను చవిచూస్తున్నామని వాపోతున్నారు.
తక్షణమే ఇన్‌చార్జిని నియమించాలన్న డిమాండ్
మండల కేంద్రంలో రెవెన్యూ కార్యాలయం ఇలా స్తంభించిపోవడంతో సాధారణ పరిస్థితులు నెలకొల్పాలని రైతులు, ప్రజలు ముక్తకంఠంతో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. పరిపాలన మందగించడం వల్ల వ్యవసాయ, వ్యాపార పనులు పూర్తిగా ఆగిపోయాయని, రోజువారీ అవసరాల కోసం ఆఫీసు చుట్టూ తిరుగుతున్నామని వారు ఆవేదన చెందుతున్నారు. కనీసం తక్షణ ఉపశమనం కోసం ఒక ఇన్‌చార్జి ఎమ్మార్వోను నియమించి, పెండింగ్‌లో ఉన్న రిజిస్ట్రేషన్లను వెంటనే పూర్తి చేయాలని వారు కోరుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ప్రజల కష్టాలను తొలగించాలని స్థానికులు వేడుకుంటున్నారు.

