- మౌంట్ ఫోర్ట్ హైస్కూల్లో ఘనంగా ‘ఇన్వెస్టిచర్’ వేడుక
కాకతీయ, ఖమ్మం టౌన్ : ఖమ్మం త్రీ టౌన్ గుట్టల బజార్‌లోని మౌంట్ ఫోర్ట్ హైస్కూల్‌లో ఇన్వెస్టిచర్ వేడుక శనివారం ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థి నాయకులకు, వివిధ సంఘాల బాధ్యతలను స్వీకరించిన విద్యార్థులకు బ్యాడ్జీలను అందజేసి, వారి హోదాను అధికారికంగా గుర్తించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన రామకృష్ణ పురం సెయింట్ థెరీసా హైస్కూల్ ప్రిన్సిపాల్ బ్రదర్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులు తమకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థి నాయకులు పాఠశాల అభివృద్ధికి కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు బ్రదర్ జాన్ పాల్ మాట్లాడుతూ, ఇన్వెస్టిచర్ వేడుక విద్యార్థులలో నాయకత్వ పటిమను పెంపొందించడానికి, పాఠశాల క్రమశిక్షణను మెరుగుపరచడానికి ఎంతో తోడ్పడుతుందని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

