- తన పాటలతో శ్రమజీవుల పక్షాన నిలిచిన విప్లవ శిఖరం
- సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి వై. ప్రకాష్
- కారేపల్లి మండలంలో ఘనంగా సంతాప సభ
- 13న రాజారాంలో సంతాప బహిరంగ సభకు పిలుపు
కాకతీయ, కారేపల్లి: ఐదు దశాబ్దాల పాటు తన ఆట, పాట, మాటలతో పీడిత ప్రజల పక్షాన నిలిచిన విప్లవ కళాకారుడు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కామ్రేడ్ అరుణోదయ నాగన్నకు కారేపల్లి మండలంలో విప్లవ జోహార్లు అర్పించారు. మండలంలోని మాదారం గ్రామంలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సంతాప సభలో ప్రజా కళాకారుడి చిత్రపటానికి నాయకులు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి వై. ప్రకాష్ మాట్లాడుతూ, అరుణోదయ నాగన్న జీవితాంతం కార్మికులు, కర్షకులు, శ్రమజీవుల కష్టాలను తన పాటల ద్వారా ప్రతిబింబిస్తూ, పాలక వర్గాల దోపిడీని ఎండగట్టారని కొనియాడారు.
వేలాది మందిని ఉద్యమ బాటలో చైతన్యపరిచిన మహోన్నత కళాకారుడని, ఆయన ఆశయాలే సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు. ఈ నెల 13న ఉదయం 10 గంటలకు నాగన్న స్వగ్రామమైన ఖమ్మం జిల్లా రాజారాం గ్రామంలో నిర్వహించనున్న సంతాప బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ప్రజాసంఘాల నాయకులు, కవులు, కళాకారులు, ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి విప్లవ నివాళులర్పించాలని కోరారు. ఈ నివాళి కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ మండల నాయకులు కోయిల శ్రీనివాస్, కావేటి నాగేశ్వరరావు, గడ్డం వెంకన్న, నరేష్, ఎర్రయ్య తదితరులు పాల్గొన్నారు.

