- ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుపై ఏసీపీ విచారణ
కాకతీయ, మద్దూర్ : వల్లంపట్ల గ్రామ పంచాయతీ గల పరిధిలోని ఓ వెంచర్ అనుమతికి సంబంధించిన అంశం వివాదానికి దారితీసింది. గ్రామానికి చెందిన యాదయ్య, హైదరాబాద్‌కు చెందిన బాబు గౌడ్ కలిసి గ్రామ కార్యదర్శిని కలిసి వెంచర్ అనుమతి గురించి వివరాలు అడిగారు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన సర్పంచ్ భర్త కర్నె మనోహర్, యాదయ్యతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. అనంతరం అక్కడికి వచ్చిన యాదయ్య తల్లి మరియమ్మ, నా కుమారుడిని ఎందుకు తిడుతున్నారు అని ప్రశ్నించగా, తనను కులం పేరుతో దూషించారని ఆమె ఆరోపించారు. ఈ ఘటనపై మరియమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా ఏసీపీ సదానందం వల్లంపట్ల గ్రామానికి చేరుకుని, సంబంధిత వ్యక్తుల నుంచి వివరాలు సేకరించి విచారణ నిర్వహించారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

