- 6 నెలల్లో 1,93,638 కేసులు నమోదు
కాకతీయ, కరీంనగర్: కరీంనగర్ నగరంలో ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తున్న వాహనదారులపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి జూన్ 30 వరకు మోటారు వాహనాల చట్టం కింద మొత్తం 1,93,638 కేసులు నమోదు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి 10.07 కోట్ల రూపాయల జరిమానా విధించగా, ఇప్పటివరకు 40,653 కేసులకు సంబంధించి 1.57 కోట్ల రూపాయలను వసూలు చేశారు. ట్రాఫిక్ పర్యవేక్షణలో సాంకేతికతకు ప్రాధాన్యం ఇస్తున్న పోలీసులు, నేరుగా తనిఖీలతో పాటు నాన్-కాంటాక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా భారీగా కేసులు నమోదు చేస్తున్నారు. ఈ-చలాన్ల ద్వారా 1,21,539 కేసులు, ఐటీఎంఎస్ కేంద్రీకృత సీసీ కెమెరాల ద్వారా 46,524 కేసులు నమోదు చేశారు. అలాగే వేగ పరిమితిని మించిన 6,043 వాహనాలను స్పీడ్ లేజర్ గన్లతో గుర్తించి చలాన్లు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఇకపై కూడా ఇదే స్థాయిలో కఠిన చర్యలు కొనసాగుతాయని పోలీసులు స్పష్టం చేశారు.

