మహిళల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
గ్రామాల అభివృద్ధికి ప్రతి అడుగులోనూ అండగా ఉంటా: ఎమ్మెల్యే పల్లా
రూ, 4 కోట్లతో నిర్మించిన నూతన భవనలు ప్రారంభం
కాకతీయ,చేర్యాల : మహిళల సాధికారత, గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తూ రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించిన మహిళా సంఘాల భవనాలు, నూతన పాఠశాల భవనాన్ని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కె. హైమావతి శుక్రవారం ప్రారంభించారు. చేర్యాల పట్టణంతో పాటు ఆకునూర్, రాంపూర్, గుర్జకుంట, పెద్దరాజుపేట, నాగపురి, శబాష్గూడెం, పోతిరెడ్డిపల్లి, చుంచన్నకోట గ్రామాల్లో నిర్మించిన మహిళా సంఘాల భవనాలను ప్రారంభించి, మహిళా సంఘాల సభ్యులతో మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ. మహిళా సంఘాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలని అన్నారు. మహిళలకు శాశ్వత వసతులు కల్పించడం ద్వారా వారి సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు, స్వయం ఉపాధి కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా సాగుతాయని పేర్కొన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన, సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. మహిళా సంఘాల అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో తన పూర్తి సహకారం కొనసాగుతుందని హామీ ఇచ్చారు.
గ్రామాల అభివృద్ధికి ప్రతి అడుగులోనూ అండగా ఉంటా: ఎమ్మెల్యే పల్లా
మహిళా సంఘాల భవనాలు, పాఠశాల భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ. గ్రామాల అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. మహిళా సంఘాలకు శాశ్వత భవనాలు అందుబాటులోకి రావడం వల్ల వారి కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా సాగుతాయని తెలిపారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు పాఠశాలల అభివృద్ధి అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు, ప్రజలు, పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

