- విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలి
- సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగ్రవాల్
- ఫూలే గురుకులంలో ఆకస్మిక తనిఖీలు
- కిచెన్, స్టోర్‌రూమ్‌లో ఆహార నాణ్యత పరిశీలన
- పదో తరగతి విద్యార్థులకు చదువు, ఆరోగ్యం, క్రమశిక్షణపై సూచనలు
కాకతీయ, వేములవాడ : “పదో తరగతి ప్రతి విద్యార్థి జీవితాన్ని మలిచే కీలక మైలురాయి. ప్రతిరోజూ తరగతులకు హాజరవుతూ ప్రణాళికాబద్ధంగా చదవాలి. గత ప్రశ్నపత్రాలను సాధన చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు” అని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ విద్యార్థులకు సూచించారు. సోమవారం వేములవాడలోని మహాత్మా జ్యోతిబా ఫూలే రెసిడెన్షియల్ విద్యాలయంలో ఆమె ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. విద్యార్థుల సంక్షేమం, విద్యా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించిన కలెక్టర్.. ముందుగా కిచెన్, స్టోర్‌రూమ్‌ను పరిశీలించి విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యత, మెనూ అమలు తీరును తనిఖీ చేశారు. విద్యార్థులకు ఎల్లప్పుడూ పరిశుభ్రమైన, నాణ్యమైన భోజనం అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
అనంతరం పదో తరగతి విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమైన కలెక్టర్ గరిమ అగ్రవాల్, చదువుతో పాటు క్రీడలకు కూడా సమయం కేటాయించాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని హితవు పలిచారు. ప్రతి విద్యార్థి స్పష్టమైన లక్ష్యంతో కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించి పాఠశాల, జిల్లా పేరు నిలబెట్టాలని ఆకాంక్షించారు. వసతి గృహంలో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించి, విద్యా నాణ్యతను మరింత మెరుగుపర్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

