- గోదావరి జలాల వినియోగంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి
- ఎల్‌ఎండీకి వెంటనే నీరు విడుదల చేయాలి
- సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి
- విద్యార్థులపై బలప్రయోగాన్ని సీపీఐ ఖండన
కాకతీయ, కరీంనగర్ : నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం లాఠీచార్జీ చేయడం అమానుషమని సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి విమర్శించారు. లీకేజీ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్‌లోని సీపీఐ జిల్లా కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నీట్ పేపర్ లీకేజీతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడిందన్నారు. ఈ అంశంపై ఢిల్లీలో విద్యార్థులు, తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు చేపట్టిన నిరసనపై లాఠీచార్జీ, భాష్పవాయు ప్రయోగం చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు. ఉద్యమాలను అణచివేయాలని చూస్తే అవి మరింత ఉధృతమవుతాయని పేర్కొన్నారు. నైతిక విలువలు, రామరాజ్యం గురించి మాట్లాడే ప్రధాని నరేంద్ర మోదీ వాటిని ఆచరణలో ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు. విద్యార్థులపై బలప్రయోగాన్ని సీపీఐ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.
గోదావరి జలాల వినియోగంపై దృష్టి పెట్టాలి
తెలంగాణ మెట్ట ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించేందుకు గోదావరి జలాలను పూర్తిస్థాయిలో వినియోగించాల్సిన అవసరం ఉందని చాడ వెంకటరెడ్డి అన్నారు. 1996 నుంచే సీపీఐ, రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ అంశంపై ఉద్యమాలు జరిగాయని గుర్తు చేశారు.వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జలయజ్ఞం ద్వారా శ్రీరాంసాగర్ వరద కాలువ, మిడ్ మానేరు, గౌరవెల్లి, గండిపల్లి వంటి ప్రాజెక్టులు ముందుకు సాగాయని పేర్కొన్నారు.
ఎల్‌ఎండీకి వెంటనే నీరు విడుదల చేయాలి
దిగువ మానేరు జలాశయంలో నీటిమట్టం కనిష్ఠ స్థాయికి చేరడంతో కరీంనగర్ ప్రజలు తీవ్ర తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నారని అన్నారు. ఎల్లంపల్లి, మిడ్ మానేరు నుంచి ఎల్‌ఎండీకి వెంటనే నీటిని విడుదల చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు రావాలని, కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని డిమాండ్ చేశారు.
రాజకీయ ఆరోపణలకు అతీతంగా ప్రజలకు సాగు, తాగునీరు అందించడం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత అని చాడ వెంకటరెడ్డి స్పష్టం చేశారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, కొయ్యడ సృజన్ కుమార్, బోయిని అశోక్, గూడెం లక్ష్మి, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, న్యాలపట్ల రాజు, పైడిపల్లి రాజు, బీర్ల పద్మ, కొట్టె అంజలి, బాకం ఆంజనేయులు, కసిబోజుల సంతోష్ చారి తదితరులు పాల్గొన్నారు.

