ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలే లక్ష్యం
పినపాక నియోజకవర్గ అభివృద్ధే ప్రభుత్వ ప్రాధాన్యం
పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
విద్యానగర్‌లో రూ.5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం
కాకతీయ, మణుగూరు రూరల్ : ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, పినపాక నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. మణుగూరు మండలం సమితి సింగారం గ్రామపంచాయతీ పరిధిలోని విద్యానగర్ కాలనీలో ₹5 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శనివారం ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాలు, కాలనీల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను దశలవారీగా చేపడుతూ ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నామని తెలిపారు.
నాణ్యతకు ప్రాధాన్యం
అనంతరం ప్రతిపాదిత రోడ్డు నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే పనులను నాణ్యత ప్రమాణాలతో, నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ పినపాక నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, మండల, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు, సర్పంచులు, వార్డు సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

