సమష్టి వ్యవసాయంతోనే రైతుకు లాభం
నేరుగా వరి విత్తితే ఖర్చు తగ్గి దిగుబడి పెరుగుతుంది
కోఆపరేటివ్ ట్రైనింగ్ సెంటర్ వైస్ ప్రిన్సిపాల్ రాజయ్య
కాకతీయ, కారేపల్లి: చిన్న, సన్నకారు రైతులను సమిష్టిగా బలోపేతం చేసి ఆధునిక వ్యవసాయ సాంకేతికత అందించడమే రైతు ఉత్పత్తిదారుల సంస్థ (ఎఫ్‌పీవో) ప్రధాన లక్ష్యమని కోఆపరేటివ్ ట్రైనింగ్ సెంటర్ వైస్ ప్రిన్సిపాల్ రాజయ్య అన్నారు. శనివారం కారేపల్లిలో రైతు ఉత్పత్తిదారుల సంస్థ, కారేపల్లి సహకార సంఘం ఆధ్వర్యంలో సంఘం అధ్యక్షుడు దుగ్గినేని శ్రీనివాసరావు అధ్యక్షతన రైతుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ ఎఫ్‌పీవోలో సభ్యత్వం పొందిన రైతులకు ప్రభుత్వం వాటా నిధులు సమకూర్చి అవసరమైన సేవలను అందిస్తోందన్నారు. సంస్థలో 750 మంది సభ్యులను చేర్చుకునే అవకాశం ఉండగా, కారేపల్లిలో ఇప్పటికే 400 మంది సభ్యులుగా చేరి కార్యకలాపాలు ప్రారంభించారని తెలిపారు.
భూసార పరీక్షలు తప్పనిసరి
వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ కవిరాజ్ మాట్లాడుతూ నేరుగా వరి విత్తే విధానంతో సాగు ఖర్చు, నీటి వినియోగం తగ్గడంతో పాటు అధిక దిగుబడి వస్తుందని చెప్పారు. పంట కాలం కూడా సుమారు 15 రోజులు తగ్గుతుందన్నారు. రైతులు భూసార పరీక్షలు చేయించుకుని, వాటి ఫలితాల ఆధారంగా ఎరువులు వినియోగించాలని సూచించారు. అనంతరం భూసార పరీక్షల విధానాన్ని వివరించి కిట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎఫ్‌పీవో డొమైన్ ఎక్స్పర్ట్ చావా అరుంధతి, సీఈవో బొల్లు హనుమంతరావు, దిశ కమిటీ సభ్యురాలు దారావత్ హేమలత బాలాజీ, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

