- నోటిఫికేషన్ల పేరుతో మోసమా?.. కాంగ్రెస్‌పై బీజేవైఎం విమర్శలు
- తెలంగాణ చౌక్‌లో బీజేవైఎం నిరసన
కాకతీయ, కరీంనగర్ : ఉద్యోగ నోటిఫికేషన్లు, నిరుద్యోగ భృతి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయకుండా నిరుద్యోగులను మోసం చేస్తోందని ఆరోపిస్తూ భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువారం కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో నిరసన చేపట్టారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నేరెడ్ల ప్రవీణ్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సంగ నరేష్ మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను గాలికొదిలేసిందని విమర్శించారు. నిరుద్యోగ భృతిని ఇప్పటికీ అమలు చేయకపోవడంతో పాటు, జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ పేరుతో యువతను నమ్మించి ఇప్పుడు తూతూ మంత్రంగా నోటిఫికేషన్లు విడుదల చేస్తోందని ఆరోపించారు.తాజాగా ప్రకటించిన పోలీసు ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా నిరుద్యోగుల ఆశలకు అనుగుణంగా లేదని, యువత ఆశలను కాంగ్రెస్ ప్రభుత్వం వమ్ము చేసిందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా అన్ని శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తూ వెంటనే సమగ్ర ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా యువతను ఏకం చేసి పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడవెల్లి శశిధర్ రెడ్డి, నక్క ప్రమోద్, గుర్రం వెంకటేష్ గౌడ్, చిక్కుల కిరణ్, గడ్డం అరుణ్, మణిదీప్, రాహుల్ రెడ్డి, జాగిరి రాజేందర్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

