- ప్రజల ఇబ్బందులపై అధికారులను నిలదీత..ప్రత్యామ్నాయ పనులకు మేయర్‌కు ఆదేశాలు
కాకతీయ, కరీంనగర్ : తీగలగుట్టపల్లి ఆర్వోబీ నిర్మాణ పనుల్లో జాప్యం, రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో పాటు స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇటీవల ఓ వృద్ధురాలు ఆర్వోబీ సమీపంలోని కల్వర్టులో పడిపోయిన ఘటనపై స్పందించిన ఆయన, అధికారులు, కాంట్రాక్టర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణ పనులు కొనసాగుతున్న సమయంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. పనుల్లో జాప్యంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.దీనిపై ఆర్అండ్బీ అధికారులు, కాంట్రాక్టర్ స్పందిస్తూ ఆర్వోబీ నిర్మాణానికి అవసరమైన భూసేకరణలో తీవ్ర జాప్యం జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో భూసేకరణ పూర్తి కాలేదని, ప్రస్తుతం ప్రభుత్వం దానిపై దృష్టి సారించి త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు వెల్లడించారు.

నిర్మాణ పనుల కారణంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా బీటీ రోడ్డు, కల్వర్టు నిర్మించాల్సి ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఆ పనులు నిలిచిపోయాయని వివరించారు.ఈ నేపథ్యంలో బండి సంజయ్ న్యూఢిల్లీ నుంచి కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావుతో ఫోన్లో మాట్లాడారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోనే బీటీ రోడ్డు, కల్వర్టు నిర్మాణానికి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సూచించారు.మంత్రి ఆదేశాల మేరకు మేయర్ కొలగాని శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ హుటాహుటిన తీగలగుట్టపల్లి ఆర్వోబీ వద్దకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. రాకపోకలకు ఏర్పడుతున్న ఇబ్బందులను గమనించి, రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో మున్సిపల్ కార్పొరేషన్ నిధులతోనే బీటీ రోడ్డు, కల్వర్టు నిర్మాణ పనులు చేపట్టాలని నిర్ణయించారు.
యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.మరోవైపు సేతు బంధన్ పథకం కింద ఆర్వోబీ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులు అందిస్తున్నప్పటికీ పనులు ఎందుకు ఆలస్యమవుతున్నాయని బండి సంజయ్ కాంట్రాక్టర్‌ను ప్రశ్నించారు. దీనికి స్పందించిన కాంట్రాక్టర్, భూసేకరణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, గత ప్రభుత్వ కాలంలో జరిగిన జాప్యం వల్లే నిర్మాణం ఆలస్యమైందని తెలిపారు. ప్రస్తుతం భూసేకరణ ప్రక్రియ వేగవంతమవుతోందని, త్వరలో నోటిఫికేషన్ జారీ కానుందని చెప్పారు.రాబోయే ఆరు నెలల్లో ఆర్వోబీ ఒక వైపు నిర్మాణ పనులు పూర్తి చేస్తామని, ఒప్పందం ప్రకారం వచ్చే ఏడాదిలోగా రెండు వైపులా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని కాంట్రాక్టర్ వెల్లడించారు.

