సీపీఐ గద్దె కూల్చివేత పిరికిపందల చర్య
ఖండించిన సీపీఐ ఖమ్మం నగర కార్యదర్శి ఎస్కే జానిమియా
కాకతీయ, ఖమ్మం టౌన్: సీపీఐ పార్టీ గద్దెను కూల్చివేయడం పిరికిపందల చర్య అని, ఇటువంటి ఘటనలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని సీపీఐ ఖమ్మం నగర కార్యదర్శి ఎస్కే జానిమియా అన్నారు. ఖమ్మం నగరంలోని 8వ డివిజన్ వైఎస్ఆర్ నగర్ కాలనీలో సీపీఐ ఏర్పాటు చేసిన పార్టీ గద్దెను బుధవారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కూల్చివేశారు. విషయం తెలుసుకున్న వెంటనే ఎస్కే జానిమియా, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఇటికాల రామకృష్ణ, ఏఐటీయూసీ ఆటో స్టాండ్ ఉపాధ్యక్షుడు షేక్ అక్రమ్, ఖానాపురం హవేలీ సహాయ కార్యదర్శి ఆముదాల వెంకన్న తదితరులు ఘటన స్థలాన్ని పరిశీలించి స్థానికులతో మాట్లాడి వివరాలు సేకరించారు.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
ఈ సందర్భంగా ఎస్కే జానిమియా మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసేలా పార్టీ గద్దెను అర్థరాత్రి వేళ కూల్చివేయడం అత్యంత ఖండనీయమన్నారు. ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం, పోలీసు అధికారులను కోరారు. ప్రజల్లో ఉద్రిక్తతలు సృష్టించే చర్యలకు ఎవరూ పాల్పడవద్దని, శాంతియుత వాతావరణాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో పాటు, కూల్చివేసిన చోటే సీపీఐ పార్టీ గద్దెను తిరిగి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

