గురుకులాల నిర్మాణం వేగవంతం చేయాలి
రఘునాథపాలెం స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను త్వరగా అందుబాటులోకి తేవాలి
జిల్లాలో ఐదు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం
ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్
ఖమ్మంలో రూ.200 కోట్లతో నిర్మిస్తున్న సమీకృత గురుకులం పరిశీలన
నాణ్యత విషయంలో రాజీ పడొద్దని అధికారులకు ఆదేశం
కాకతీయ, మయూరి సెంటర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణ పనులను నిర్ణీత గడువులోగా, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ అధికారులను ఆదేశించారు. గురువారం ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం వైఎస్సార్ నగర్‌లో రూ.200 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాల పనులను ఆయన పరిశీలించారు. హాస్టల్ భవనాలు, అకాడమిక్ బ్లాక్‌లు, డార్మిటరీలు, వంటశాల, భోజనశాల, ప్రధాన నివాస భవనం, సిబ్బంది క్వార్టర్ల నిర్మాణ పనులను కాలినడకన పరిశీలించిన దివాకర్ టీఎస్, ప్రతి నిర్మాణం సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు.

గడువులోగా పనులు పూర్తి చేయాలి
జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం ఐదు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం కొనసాగుతోందని దివాకర్ టీఎస్ తెలిపారు. ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించిన గురుకుల నిర్మాణ పనుల్లో వేగం పెంచి ఒప్పందం ప్రకారం నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్య అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం అత్యాధునిక మౌలిక వసతులతో ఈ విద్యాసంస్థలను నిర్మిస్తోందని ఆయన పేర్కొన్నారు. విద్యతో పాటు క్రీడలు, సాంకేతిక నైపుణ్యాలు, వ్యక్తిత్వ వికాసానికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించేలా ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టాలని సూచించారు. పాఠశాల ఆవరణలో అంతర్గత రహదారులు, లింక్ రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్, పచ్చదనం వంటి మౌలిక సదుపాయాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలని ఆదేశించారు. అనంతరం రఘునాథపాలెం మండల కేంద్రంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ బాలుర గురుకుల పాఠశాల, కళాశాల భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ పనులను నెల రోజుల్లోగా పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నిర్మాణ సంస్థలు, ఇంజినీరింగ్ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ పనుల పురోగతిని ప్రతిరోజూ సమీక్షించి, ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని కలెక్టర్ సూచించారు.

